Gujarat Horror: బాలికను 34 సార్లు పొడిచిన యువకుడికి మరణశిక్ష.. ప్రేమను నిరాకరించినందుకు ఘాతుకం.. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఘటన
గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో జరిగిందీ ఘటన.
Rajkot, March 14: ప్రేమను నిరాకరించిందన్న కోపంతో ఓ బాలికను 34 సార్లు పొడిచి (Stabbed) చంపిన యువకుడికి కోర్టు మరణశిక్ష విధించింది. గుజరాత్‌లోని (Gujarat) రాజ్‌కోట్‌లో (Rajkot) జరిగిందీ ఘటన. వివరాల్లోకి వెళ్తే.. ప్రేమను నిరాకరించిన 11వ తరగతి చదువుతున్న బాలికపై 26 ఏళ్ల జయేష్ సార్వయా కత్తితో విచక్షణ రహితంగా దాడిచేశాడు. 34 సార్లు పొడిచి ఆమె మరణానికి కారణమయ్యాడు. మార్చి 2021లో జరిగిందీ ఘటన. బాధిత బాలిక, నిందితుడు ఇద్దరూ జెట్‌పూర్‌లోని జెటల్సాపూర్ గ్రామానికి చెందినవారే. బాలికను అప్పటికే కొంత కాలంగా వేధిస్తున్న జయేశ్.. 16 మార్చి 2021న తన ప్రేమ విషయాన్ని ప్రపోజ్ చేసేందుకు ఆమె ఇంటికి వెళ్లాడు. అతడి ప్రపోజల్‌ను నిరాకరించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన జయేశ్ ఆమె ఇంటి బయటే కత్తితో దాడిచేశాడు. తీవ్రంగా గాయపడిన బాలిక మరణించింది. నిందితుడిని అడ్డుకోవడానికి యత్నించిన బాలిక సోదరుడికి గాయాలయ్యాయి. తాజాగా, కేసును విచారించిన ధర్మాసనం నిందితుడికి ఉరిశిక్ష విధించింది.
అరుదైన కేసుల్లో అరుదైనది
ఈ కేసును విచారించిన అడిషనల్ డిస్ట్రిక్స్, సెషన్స్ కోర్టు నిందితుడిని దోషిగా తేల్చి మరణ శిక్ష విధించింది. నిర్భయ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్వచనం ప్రకారం ఈ కేసును న్యాయమూర్తి అరుదైన కేసుల్లో అరుదైనదిగా అభివర్ణించారు. నిందితుడికి మరణశిక్షతోపాటు రూ. 5 వేల జరిమానా కూడా విధించించారు. అప్పీలు చేసుకునేందుకు నిందితుడికి నెల రోజుల సమయం ఇచ్చారు.