New Delhi, NOV 20: ఢిల్లీ నగరం గ్యాంగ్‌స్టర్లకు అడ్డాగా మారిందని ఢిల్లీ సీఎం అతిశీ (Delhi CM Atishi) అన్నారు. ఢిల్లీ లా అండ్ ఆర్డర్‌ను చేతిలో పెట్టుకుని కేంద్రం ఏం చేస్తోందని ఆమె మండిపడ్డారు. ఇటీవల ఢిల్లీలో హత్యకు గురైన యువకుడి కుటుంబాన్ని పరామర్శించిన అతిశీ.. కేంద్ర మంత్రి అమిత్ షాపై (Amith Shah) తీవ్ర విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. ఇటీవల సుందర్‌నగరిలో ఇద్దరు యువకులు ఓ మహిళను వేధిస్తుండగా ఆమె కుటుంబీకులు, బంధువులు మందలించి పంపించారని, అది మనుసులో పెట్టుకున్న ఆ ఇద్దరు యువకులు తిరిగి కత్తులతో వచ్చి దాడికి పాల్పడ్డారని, ఆ దాడిలో 28 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని అతిశీ వెల్లడించారు. ఇవాళ మృతుడి కుటుంబాన్ని కలిసిన ఆమె రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. ఢిల్లీ గ్యాంగ్‌స్టర్లకు రాజధానిగా మారిందని, నేరస్థులు, దోపిడీదారులు, గూండాలకు భయం లేకుండా పోయిందని అన్నారు. నేరస్థులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోకపోవడంతో నేరాలు పెరుగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుంచి తాను ఓ విషయం తెలుసుకోవాలని అనుకుంటున్నానని, ఢిల్లీ శాంతిభద్రతల బాధ్యత ఆయన చేతుల్లో పెట్టుకుని ఏం చేస్తున్నారని అతిశీ ప్రశ్నించారు. ఆయనకు ఎన్నికల ప్రచారం మీద ఉన్న ధ్యాస ఢిల్లీలో శాంతిభద్రతలపై లేదని విమర్శించారు.