Whatsapp Map Error: ఇండియా మ్యాప్ ను తప్పుగా చూపెడుతూ వాట్సాప్ న్యూ ఇయర్ వీడియో.. హెచ్చరించిన కేంద్రమంత్రి.. వాట్సాప్ క్షమాపణలు.. వీడియో తొలగింపు
భారత్‌లో ఉండి వ్యాపారం చేసుకుంటూ ఇదేం పని అని మండిపడ్డారు.
Newdelhi, Jan 1: భారత చిత్ర పటాన్ని (India Map) తప్పుగా చూపించిన మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’పై (Whatsapp) కేంద్ర ఐటీశాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ (Rajeev Chandrasekhar) ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌లో ఉండి వ్యాపారం (Business) చేసుకుంటూ ఇదేం పని అని మండిపడ్డారు. తప్పుగా చూపించిన మ్యాప్‌ను వెంటనే సరిచేయాలని ట్విట్టర్ (Twitter) ద్వారా సూచించారు.
న్యూ ఇయర్ సందర్భంగా వాట్సాప్ ఓ వీడియోను రూపొందించి ట్వీట్ చేసింది. ఆ వీడియోలో వాట్సాప్ చూపించిన గ్లోబ్‌లో పాక్ ఆక్రమిత కశ్మీర్‌తోపాటు చైనా తనదిగా చెబుతున్న కొన్ని భూభాగాలను వాట్సాప్ భారత్ నుంచి మినహాయించింది. నెటిజన్లు ఈ వీడియోపై మండిపడ్డారు. వాట్సాప్‌పై విమర్శలు గుప్పించారు. స్పందించిన కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్.. వెంటనే తప్పును సరిదిద్దాలని వాట్సాప్‌ను కోరారు. భారత్‌లో వ్యాపారాలు చేసే, కొనసాగాలనుకునే అన్ని ప్లాట్‌ఫాంలు తప్పనిసరిగా సరైన భారత పటాలను ఉపయోగించాలని సూచించారు.
వీడియో వివాదాస్పదం కావడంతో స్పందించిన వాట్సాప్ దానిని ట్విట్టర్ నుంచి తొలగించింది. అనుకోకుండా ఈ ఘటన జరిగిందని, లోపాన్ని ఎత్తి చూపినందుకు ధన్యవాదాలను అని పేర్కొంది. ఆ పోస్టును తొలగించామని, క్షమించాలని వేడుకుంది. ఇకపై ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉంటామని మంత్రికి వివరణ ఇచ్చింది.
కొత్త ఏడాది నిరుద్యోగులకు శుభవార్త... మరికొన్ని నోటిఫికేషన్లు విడుదల చేసిన టీఎస్ పీఎస్ సీ