Amaravati Land Scam: భూదందా కేసులో హైకోర్టుకు చంద్రబాబు, తనపై నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని పిటిషన్, భూములు కాజేసిన వారికి శిక్ష తప్పదంటున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి, బాబును ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చిన సీఐడీ
ఈ నేపథ్యంలో దీనిపై చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు. సీఐడీ నోటీసుల అంశంపై న్యాయనిపుణుల సలహాలు తీసుకున్న చంద్రబాబు... రేపు హైకోర్టులో పిటిషన్ వేయనున్నారు. అమరావతి భూముల అంశంలో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని పిటిషన్ లో కోరనున్నారు.
Amaravati, Mar 17: అమరావతిలో భూ దందా జరిగిందని, చంద్రబాబు హయాంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ చోటు చేసుకుందన్న ఆరోపణలపై నిన్న సీఐడీ నోటీసులు ఇవ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు. సీఐడీ నోటీసుల అంశంపై న్యాయనిపుణుల సలహాలు తీసుకున్న చంద్రబాబు... రేపు హైకోర్టులో పిటిషన్ వేయనున్నారు. అమరావతి భూముల అంశంలో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని పిటిషన్ లో కోరనున్నారు.
కాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ( MLA Alla Ramakrishna Reddy) ఫిర్యాదుతో చంద్రబాబు (TDP Chief N Chandrababu Naidu), మాజీమంత్రి నారాయణలకు సీఐడీ (Crime Investigation Department (CID)) అధికారులు నోటీసులు జారీ చేశారు. 41 (ఏ) సీఆర్పీసీతో పాటు ఎఫ్ఐఆర్ ప్రతిని కూడా సీఐడీ పోలీసులు చంద్రబాబు, నారాయణలకు అందజేశారు. చంద్రబాబుపై 120 బీ, 166, 167, 217 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని, లేకపోతే అరెస్టు చేయాల్సి వుంటుందని నోటీసుల్లో స్పష్టం చేశారు.
దళితులను భయపెట్టి, బెదిరించి వారి భూములను కాజేసిన (Amaravati Land Scam) చంద్రబాబు, నారాయణ అండ్‌కో, వారి బినామీలకు శిక్ష తప్పదని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) స్పష్టం చేశారు. మంగళవారం గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆయన మాట్లాడుతూ.. అన్ని ఆధారాలతోనే తాను ఫిర్యాదు చేసిన మేరకు సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారన్నారు. దర్యాప్తు చేసిన అధికారులు అన్ని ఆధారాలతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణకు నోటీసులు జారీ చేశారని చెప్పారు.
చంద్రబాబు రాజధానిని ప్రకటించకుండా నూజివీడు, అక్కడ.. ఇక్కడ అంటూ లీకులు ఇస్తూ తమ బినామీలతో మాత్రం ఒక్క మంగళగిరి నియోజకవర్గంలోనే 500 ఎకరాల అసైన్డ్ భూములు కొనుగోలు చేయించారన్నారు. మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాలలోని రాజధాని ప్రాంతంలో సుమారు 3,500 ఎకరాలను కొట్టేశారని ఆరోపించారు. విచారణలో నిజాలన్నీ బయటకొస్తాయన్నారు. దళితుల భూములను విక్రయించరాదని, బదలాయించరాదని చట్టంలో స్పష్టంగా ఉందన్నారు.
చట్టాలను అతిక్రమించి.. కేబినేట్‌లో ఆమోదం పొందకుండా అసైన్డ్ భూములను కొనుగోలు చేశారని తెలిపారు. అనంతరం, తన అనుంగులకు కోట్లాది రూపాయలు లబ్ధి చేకూర్చేలా వాటిని కట్టబెట్టారని విమర్శించారు. దీంతో అమాయకులైన దళిత సోదరులు తీవ్రంగా నష్టపోయారన్నారు. దళితులకు న్యాయం చేయాలంటూ దళితులే ఫిర్యాదు చేయాలని ఎక్కడా లేదని, వారి తరఫున ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చని టీడీపీ నేతలు తెలుసుకోవాలని హితవు పలికారు. చంద్రబాబుకు తప్పు చేయలేదనే నమ్మకం ఉంటే సీఐడీ విచారణను ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు.
ఇదిలా ఉంటే కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబుకు సీఐడీ నోటీసు ఇచ్చిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. దేశ చరిత్రలో ఒక మాజీ ముఖ్యమంత్రిపై మొదటిసారి ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు పెట్టారని ఒక ప్రకటనలో తెలిపారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎస్సీనా, ఎస్టీనా?, ఆయన ఫిర్యాదు చేయగానే ఈ కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు. రాజధానిలో అసైన్డ్ రైతులకు కూడా జరీబు రైతులకు ఇచ్చిన ప్యాకేజీనే ఇచ్చామని, ల్యాండ్ పూలింగ్ 2015లో జరిగితే దానిపై ఇప్పుడు సీఐడీ నోటీసులు అంటూ కేసు పెట్టడం కక్ష సాధింపు కాదా? అని ప్రశ్నించారు.
చంద్రబాబు, నారాయణలకు సీఐడీ నోటీసు జారీ చేయడం హాస్యాస్పదమని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఒక ప్రకటనలో తెలిపారు. సీఐడీ కేసు నమోదు చేయడం వెనుక కుట్ర ఉందన్నారు. సిల్లీ కేసులతో చంద్రబాబు గడ్డం మీద నెరిసిన వెంట్రుక కూడా పీకలేరని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ట్వీట్ చేశారు. అమరావతిని అంతం చెయ్యడానికి ఎన్ని కుట్రలు చేసినా, దైవభూమి తనని తానే కాపాడుకుంటుందన్నారు.
అమరావతి దళితులను మోసగించి చంద్రబాబు అండ్ కో భారీ కుంభకోణానికి పాల్పడిందని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) పేర్కొన్నారు. మాజీ సీఎం చంద్రబాబుకు సీఐడీ నోటీసులు జారీ చేయడంపై మంగళవారం ఆయన స్పందిస్తూ.. అవసరమైతే సీఐడీ అధికారులు ఆయనను అరెస్ట్ చేసి కోర్టుకు కూడా పంపుతారని మంత్రి నాని స్పష్టం చేశారు. తనకు తానే సీఆర్‌డీఏ చైర్మన్‌గా ప్రకటించుకున్న చంద్రబాబు ఇష్టానుసారం జీవోలు విడుదల చేసి, దళితులను మోసం చేసి రూ.500 కోట్లకు పైగా సొమ్ము కాజేశారని తెలిపారు.
అచ్చెన్నాయుడు, బుద్దా వెంకన్నలాంటి కుక్కలు ఎంత మొరిగినా తమను గెలిపించిన దళితులకు న్యాయం చేసేందుకు వెనుకాడే ప్రసక్తే లేదన్నారు. ప్రభుత్వం దళితులకు న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తుందని, ఇందులో భాగంగా చంద్రబాబుకు నోటీసులు జారీ అయ్యాయని చెప్పారు. చంద్రబాబు, ఆయనకు సహకరించిన మాజీ మంత్రి నారాయణ, ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం తప్పు లేదన్నారు.