File image of TDP Chief Chandrababu Naidu | (Photo-Instagram)

Amaravathi, March 16: అమరావతి భూ అవకతవకలపై ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ విభాగం ఏపి ప్రతిపక్షనేత, టీడీపీ  చీఫ్ చంద్రబాబు నాయుడుకు నోటీసులు జారీ చేసింది. మంగళవారం ఉదయం సిఐడి అధికారులు హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి చేరుకుని నోటీసులు ఇచ్చారు. మార్చి 23న విచారణకు హాజరు కావాలని కోరారు. చంద్రబాబుతో పాటు ఈ కేసులో మరో ఎనిమిది మంది పేర్లను సిఐడి అధికారులు నమోదు చేశారు. ఇందులో మాజీ మంత్రి నారాయణ పేరు కూడా ఉంది. 41 సిఆర్‌పిసి కింద నోటీసులు జారీ చేసినట్లు  సిఐడి చీఫ్ సునీల్ కుమార్ తెలిపారు.

నివేదికల ప్రకారం మొత్తం ఆరుగురు అధికారులు హైదరాబాద్‌లోని చంద్రబాబు ఇంటికి చేరుకున్నారు. తరువాత వారు భద్రతా సిబ్బందితో మాట్లాడి నివాసంలోకి ప్రవేశించారు. అమరావతి ప్రాంతంలో అసైన్డ్ భూముల అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ జరిగిందనే ఆరోపణలపై నోటీసులు అందించినట్లు సమాచారం.

ఈ వ్యవహారంపై తెలుగుదేశం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  జగన్ ప్రభుత్వం కక్షపూరితంగా తమ అధినేతపై తప్పుడు కేసులను రూపొందించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. జగన్ ఎన్ని కుట్రలు చేసినా భయపడేది లేదని, న్యాయం తమ వైపే ఉంటుందని టీడీపీ  నేతలు అంటున్నారు.

అయితే మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం టీడీపీ ఆరోపణలను ఖండించారు. విచారణ జరిగితేనే అసలు వాస్తవాలేమిటో బయటకు తెలుస్తాయని అన్నారు. ప్రభుత్వం ఎవరినీ కావాలని కేసులో ఇరికించడం లేదని, కేసుకు సంబంధించి సిఐడి ఎవరినైనా విచారిస్తుందని బొత్స పేర్కొన్నారు. రాజధాని భూసేకరణలో అవినీతి జరిగింది, రాజధాని భూములపై ప్రభుత్వం ఇప్పటికే రెండు కమిటీలు వేసింది. అమరావతి భూములలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని నిర్ధారణకు వచ్చాకే సిఐడి నోటీసులు జారీచేసింది.  ఆధారాలు లేకుండానే నోటీసులు ఎవరైనా ఇస్తారా? ఆధారాలు ఉన్నాయి కాబట్టే చంద్రబాబుకు సిఐడి నోటీసులు ఇచ్చింది. విచారణ జరిపితే తప్పేముంది అని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు.

కాగా, అమరావతిలోని భూముల ఇన్ సైడ్ ట్రేడింగ్ కు సంబంధించిటీడీపీ మరియు వైసీపీ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు చాలా రోజుల నుంచే జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ కేసు ఏపి హైకోర్టులో విచారణలో ఉంది.