Amaravati Land Scam: అమరావతి కుంభకోణంలో ఎవ్వర్నీ వదిలిపెట్టం, అవినీతి మొత్తం బయటకు తీసి అందర్నీ అరెస్టు చేస్తాం, సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
జరిగిన అవినీతి మొత్తం బయటకు తీస్తామని తెలిపారు. కచ్చితంగా అరెస్టులు కూడా జరుగుతాయని అన్నారు. సిట్ దర్యాప్తుతో మరిన్ని వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పారు.
Amaravati, May 3: రాజధాని అమరావతి పేరుతో భారీ అవినీతి జరిగిందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. జరిగిన అవినీతి మొత్తం బయటకు తీస్తామని తెలిపారు. కచ్చితంగా అరెస్టులు కూడా జరుగుతాయని అన్నారు. సిట్ దర్యాప్తుతో మరిన్ని వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పారు. సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ విజయం దక్కిందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. విధానపరమైన నిర్ణయాలతో రాష్ట్రానికి నష్టం కలిగిస్తే తప్పేనని పేర్కొన్నారు.
గతంలో జరిగిన తప్పులను తప్పకుండా సమీక్ష చేయాల్సిందేనని తెలిపారు. రాష్ట్ర సంపదకు నష్టం కలిగించే కుట్రలను బయటకు తీస్తామన్నారు. టీడీపీ హయాంలో తప్పు చేయకపోతే వారికి భయమెందుకని ప్రశ్నించారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలోనూ చంద్రబాబు హస్తం ఉందని సజ్జల పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ స్కాంకు రాజధాని పేరు పెట్టారని.. అమరావతి పేరు చెప్పి దోచుకోవాలనుకున్నారని మండిపడ్డారు. అరచేతిలో స్వర్గం చూపించి రైతులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాత్కాలిక నిర్మాణాల్లోనూ అవినీతికి పాల్పడ్డరన్నారు. టీడీపీ హయాంలో దేశంలోనే అతిపెద్ద భూ కంభకోణం జరిగిందన్నారు. నిజనిజాలను బయటకు తీసేందుకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రాజధాని పేరుతో చంద్రాబాబు ముఠా దోచుకున్నారని సజ్జల దుయ్యబట్టారు. తప్పు చేయకపోతే స్టే కోసం కోర్టులకు ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. టీడీపీ సహా చంద్రబాబు ముఠాకు ఎందుకంత భయమని అన్నారు. టీడీపీ హయాంలో అక్రమాలపై సిట్ ఏర్పాటు జరిగిందని, సిట్ దర్యాప్తుపై స్టే తెచ్చుకుంటే అందులో ఏదో మతలబు ఉన్నట్లేనని అన్నారు. టీడీపీ నేతల్లో ఒకవైపు భయం, మరోవైపు అహంకారం కనిపిస్తోందన్నారు. సిట్ ఏర్పాటు కక్ష సాధింపు కానే కాదని స్పష్టం చేశారు.