Andhra Pradesh: అల్లరి పిల్ల ఫేస్‌బుక్ ఐడీతో జాగ్రత్త, నగ్నంగా వీడియో కాల్స్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్న యువతి, ఎనిమిది మంది మధ్యవర్తులను అరెస్ట్ చేసిన చిత్తూరు పోలీసులు
ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపడం.. ఆ తర్వాత స్నేహితులు అయ్యాక.. నగ్నంగా వీడియోకాల్స్ చేసి మాట్లాడుకోవడం, కొందరికి నిఘా యాప్స్ పంపి మొబైల్ స్క్రీన్ షేరింగ్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకోవడం ద్వారా రూ.లక్షలు (Fraud with Social Media) కొల్లగొట్టింది.
Chittoor, Mar 9: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఓ యువతి ‘అల్లరిపిల్ల’ (Allaripilla) అవతారం ఎత్తి భారీ మోసాలకు పాల్పడింది. ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపడం.. ఆ తర్వాత స్నేహితులు అయ్యాక.. నగ్నంగా వీడియోకాల్స్ చేసి మాట్లాడుకోవడం, కొందరికి నిఘా యాప్స్ పంపి మొబైల్ స్క్రీన్ షేరింగ్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకోవడం ద్వారా రూ.లక్షలు (Fraud with Social Media) కొల్లగొట్టింది. దీని కోసం వేరే వాళ్లని ఏజెంట్లుగా పెట్టుకుంది. వారు కమీషన్ కోసం తమ బ్యాంకు ఖాతాల్లోకి నగదు వేయించుకున్నారు. ఈ ఎనిమిది మంది మధ్యవర్తులను చిత్తూరు పోలీసులు అరెస్టు (Allaripilla Gang arrested) చేశారు. డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, సీఐ యుగంధర్ మంగళవారం వివరాలను మీడియాకు వెల్లడించారు.
ఫేస్‌బుక్‌లో అల్లరిపిల్ల అనే ఐడీ నుంచి పలువురికి ఫ్రెండ్ రిక్వెస్టులు వచ్చేవి. వీటిని అంగీకరించిన కొద్దిరోజుల్లోనే ఓ అజ్ఞాత యువతి మెసెంజర్ ద్వారా వాయిస్‌కాల్స్ చేసి, మత్తెక్కించే మాటలతో అవతలి వాళ్లను తన బుట్టలో వేసుకునేది. అనంతరం వీడియో కాల్స్ ద్వారా నగ్నంగా మాట్లాడుకోవడం, నేరుగా కలవడానికి నమ్మకం వచ్చాక ప్రమాదకరమైన స్పై (నిఘా) యాప్స్ లింకులను పురుషుల మొబైళ్లకు పంపేది.
ఆ లింకులను ఇన్‌స్టాల్ చేసుకున్న తరువాత అవతలి వ్యక్తి మొబైల్‌లో ఏం చేసినా అల్లరిపిల్ల తన సెల్‌ఫోన్ నుంచే చూసేది. మరికొందరికి క్రెడిట్‌కార్డులు ఇప్పిస్తామంటూ నిఘా యాప్స్ పంపేది. ఆపై ఫోన్‌పే, గూగుల్‌పే, నెట్ బ్యాంకింగ్ ద్వారా బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదును మాయం చేసేది. ఈ డబ్బులను నేరుగా తన బ్యాంకు ఖాతాకు కాకుండా కొందరు వ్యక్తులను మధ్యవర్తులుగా నియమించుకుని వారి ఖాతాల్లోకి మళ్లించేది.
ఇలా ఓ పది బ్యాంకు ఖాతాల నుంచి అల్లరిపిల్ల ఖాతాలోకి నగదు వెళ్తుంది. చిత్తూరు నగరానికి చెందిన సీకే మౌనిక్ అనే వ్యక్తి సైతం అల్లరిపిల్ల మాయలోపడి ఆమె పంపిన నిఘా యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నాడు. అంతే.. రూ.3.64 లక్షలు బ్యాంకు నుంచి మాయమయ్యాయి. ఈనెల 3న బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో టూటౌన్ పోలీసులు కేసు నమోదుచేశారు.
మాయమైన నగదు ఏయే ఖాతాల్లో జమయ్యిందో తెలుసుకుని విశాఖ జిల్లాకు చెందిన ఎ. సాంబశివరావు (32), బి.ఆనంద్‌మెహతా (35), జి. శ్రీను (21), సి. కుమార్‌రాజు (21), ఎల్.రెడ్డి మహేష్ (24), జి. శివకుమార్ (21), వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన సి. సుధీర్‌కుమార్ అలియాస్ సుకు (30), వరంగల్‌కు చెందిన టి.శ్రావణ్‌కుమార్ (31) అనే మధ్యవర్తులను పోలీసులు అరెస్టుచేశారు. కేసు ఛేదించడంలో ప్రతిభ చూపించిన ఎస్‌ఐలు మల్లికార్జున, లోకేష్‌లను డీఎస్పీ అభినందించారు. ఈ ఎనిమిది మందికి కూడా ఆ అల్లరిపిల్ల ఎవరో తెలియకపోవడం కొసమెరుపు.