Andhra Pradesh: రూ. 60 కోట్ల అక్రమాస్తులు, ఏసీబీ వలలో భీమవరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దాడులు
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎస్.శివరామకృష్ణ (Bhimavaram Municipal Commissioner) ఇంటిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు జూన్ 21 (బుధవారం) దాడులు నిర్వహించి ఆదాయానికి మించిన ఆస్తులను వెలికితీశారు.
Bhimavaram, June 22: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎస్.శివరామకృష్ణ (Bhimavaram Municipal Commissioner) ఇంటిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు జూన్ 21 (బుధవారం) దాడులు నిర్వహించి ఆదాయానికి మించిన ఆస్తులను వెలికితీశారు.
మున్సిపల్ కమీషనర్ (Bhimavaram Municipal Commissioner S. Sivarama Krishna) క్వార్టర్స్‌లోని శివరామకృష్ణ ఇంటిపై పలు బృందాలు దాడులు నిర్వహించగా ఉండ్రాజవరం మండలం పాలకొల్లు, భీమవరం, విజయవాడ, తణుకులో దాదాపు మూడెకరాల భూమి, ఇళ్లకు సంబంధించిన పత్రాలు లభించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.రూ. 20 లక్షల నగదు, 500 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు కార్లు, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. రూ.60 కోట్ల మేర అక్రమాస్తులు గుర్తించినట్లు సమాచారం.
డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఆదేశాల మేరకు విజయవాడ ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం వేకువజామున భీమవరంలోని మున్సిపల్ కమిషనర్ ఇల్లు, కార్యాలయం, మున్సిపల్ ఉద్యోగి(ఆర్‌ఐ) కృష్ణమోహన్ ఇంట్లో, తణుకు, ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామం, పాలకొల్లు, బాపట్ల, విజయవాడలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. చెత్త సేకరణ మొదలు, కారుణ్య నియామకాల వరకు వసూళ్ల కోసం ప్రత్యేకంగా ఉద్యోగులను నియమించుకున్న శివరామకృష్ణ - అక్రమ సంపాదనతో విదేశీ పర్యటనలు చేసినట్లు ఏసీబీ గుర్తించింది.
ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలో 3.03 ఎకరాల భూమి, పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జీప్లస్ 1 భవనం, తణుకులో రెండు జీప్లస్ 1 భవనాలు, పాలకొల్లులో జీప్లస్ భవనం, ఒక ఖాళీ నివాస స్థలం, విజయవాడలో రెండు అపార్ట్మెంట్లు, ఇంట్లో నగదు రూ.20 లక్షలు, 500 గ్రాముల బంగారం, రెండు కార్లు, ఒక ద్విచక్ర వాహనంతో పాటు విలువైన పత్రాలను స్వాదీనం చేసుకున్నట్టు చెప్పారు. అలాగే విజయవాడలో ఒక అపార్ట్‌మెంట్‌కు సంబంధించి సోదాలు కొనసాగించాల్సి ఉందని డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. కమిషనర్‌ను అరెస్ట్ చేసి విజయవాడ ఏసీబీ కోర్టుకు హాజరు పరుస్తామన్నారు.