Loan App Harassment: లోన్ యాప్స్‌పై ఏపీ ప్రభుత్వం కొరడా, వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు, లోన్ యాప్ ఆగడాలు భరించలేక దంపతులు ఆత్మహత్య
లోన్ యాప్‌ల ఆగడాలపై (Loan app harassment) కఠిన చర్యలకు జగన్ ప్రభుత్వం ఆదేశించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అనుమతి లేని లోన్‌యాప్‌లపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు.
Amaravati, Sep 7: లోన్ యాప్స్ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. లోన్ యాప్‌ల ఆగడాలపై (Loan app harassment) కఠిన చర్యలకు జగన్ ప్రభుత్వం ఆదేశించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అనుమతి లేని లోన్‌యాప్‌లపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ఏపీ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
బుధవారం రోజున రుణ యాప్ వలలో పడి రాజమహేంద్రవరానికి (Rajamandri) చెందిన కొల్లి దుర్గారావు, రమ్యలక్ష్మి దంపతులు ఆత్మహత్య (couple ended lives) చేసుకున్నారు. దీంతో వారి ఇద్దరి చిన్నారులు నాగసాయి (4), లిఖిత శ్రీ(2)లు అనాధలుగా మిగిలారు. అయితే ఈ ఘటనపై చలించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిన్నారులు ఇద్దరికి చెరో రూ.5లక్షల సహాయం అందజేయాలని జిల్లా కలెక్టర్ కె.మాధవీలతకి ఆదేశాలిచ్చారు.
ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ, 57 కీలక అంశాలతో పాటు రూ.1.26 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం
అల్లూరి సీతారామ రాజు జిల్లా రాజవొమ్మంగి చెందిన కొల్లి దుర్గాప్రసాద్ (32), రమ్యలక్ష్మి (24) దంపతులు ఇంటి అవసరాల నిమిత్తం సెల్‌ఫోన్ ద్వారా లోన్ యాప్‌లో కొంత సొమ్మును అప్పుగా తీసుకున్నారు. అయితే అది సకాలంలో చెల్లించకపోవడం, వడ్డీ పెరిగిపోవడంతో లోన్ యాప్‌కు సంబంధించిన టెలీకాలర్స్ తరచూ ఫోన్ చేసి వేధించేవారు.మీ నగ్న చిత్రాలు మా వద్ద ఉన్నాయి.. అప్పు చెల్లించకపోతే వాటిని బయటపెడతాం’ అని బెదిరించారు. అంతేకాకుండా దుర్గాప్రసాద్ బంధువులకు, స్నేహితులకు ఫోన్ చేసి అప్పు తీసుకున్న విషయాన్ని చెప్పారు. దీంతో పరువు పోయిందని భార్యాభర్తలిద్దరూ మనస్తాపం చెందారు.
తరచూ లోన్ యాప్ నిర్వాహకులు ఫోన్ చేసి వేధిస్తుండడంతో తట్టుకోలేకపోయారు. ఈ నెల 5న పిల్లలను ఇంటిలో వదిలేసి బయటకు వచ్చిన దంపతులు రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోదావరి గట్టుపై అదే రోజు రాత్రి ఒక లాడ్జిలో దిగారు. కొద్ది సమయం తర్వాత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. బంధువులకు ఫోన్ చేసి తాము చనిపోతున్నామని చెప్పారు. విషయం తెలిసిన బంధువులు అదే రోజు అర్ధరాత్రి సమయానికి లాడ్జి వద్దకు చేరుకున్నారు.
అపస్మారక స్థితిలో ఉన్న భార్యాభర్తలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం దుర్గాప్రసాద్, రమ్యలక్ష్మి మృతి చెందారు. ఈ ఘటనపై మృతుడి సోదరుడు సోమరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. టూటౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వీరికి మూడేళ్లు, రెండేళ్ల వయసు ఉన్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దుర్గాప్రసాద్ జొమాటో డెలివరీ బాయ్‌గా, అతడి భార్య రమ్యలక్ష్మి మిషన్ కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్నారు.