AP New Districts: ఏపీలో మరో కొత్త జిల్లా, గిరిజన ప్రాంతాలు కలిపి ఒకే జిల్లాగా ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం, రంపచోడవరం, పొలవరం ముంపు గ్రామాలతో కలిపి కొత్త జిల్లా ఏర్పాటు

గిరిజన ప్రాంతాలు కలిపి ఒకే జిల్లాగా ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు 26 జిల్లాలకు అదనంగా మరో జిల్లా ( another new district) వచ్చే అవకాశం ఉందని మంత్రి పేర్ని నాని సంకేతాలు కూడా పంపించారు.

Amaravati, April 5: ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త జిల్లా ఏర్పాటుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. గిరిజన ప్రాంతాలు కలిపి ఒకే జిల్లాగా ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు 26 జిల్లాలకు అదనంగా మరో జిల్లా ( another new district) వచ్చే అవకాశం ఉందని మంత్రి పేర్ని నాని సంకేతాలు కూడా పంపించారు. రంపచోడవరం, పొలవరం ముంపు గ్రామాలతో కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం (Andhra Pradesh govt) కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా రాష్ట్రంలోని 13 జిల్లాలు (AP New Districts) రెట్టింపు అవడంపై వాడవాడలా సంబరాలు మిన్నంటాయి.ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలుచేస్తూ సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు.విశాఖపట్నం జిల్లాను మూడు జిల్లాలుగా విభజించడంతో కొత్త జిల్లాలైన అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కొత్త పాలనా యంత్రాంగం కొలువుదీరింది. అనకాపల్లి జిల్లా ఏర్పాటుతో ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్‌ పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్‌లో తొలిరోజునే స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ప్రధాని మోదీతో నేడు ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ, రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ

ఏజెన్సీలోని మండలాల్ని కలుపుతూ పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లాని ఏర్పాటుచేయడంతో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనకాపల్లి జిల్లా ఏర్పాటుతో హుషారుగా ప్రదర్శనలు నిర్వహించి కేక్‌ కట్‌ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో కొత్తగా పలాస రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుపై ఇచ్ఛాపురంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ, ఆ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త పిరియా సాయిరాజ్‌లు సోమవారం ర్యాలీ నిర్వహించి సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి రాజమహేంద్రవరం కేంద్రంగా తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ జిల్లాలు ఏర్పాటుతో ప్రజలు కేరింతలు కొట్టారు. పాతికేళ్లుగా ఎదురుచూస్తున్న కోనసీమ జిల్లా కల నెరవేరడంతో కోనసీమ వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. జిల్లా కలెక్టరేట్, జిల్లా ఎస్పీ కార్యాలయాల భవనాలు అందంగా అలంకరించారు. ఉమ్మడి వైఎస్సార్‌ కడప జిల్లాలో అన్నమయ్య జిల్లా ఆవిర్భావం సందర్భంగా జిల్లా కేంద్రమైన రాయచోటిలో సోమవారం సంబరాలు మిన్నంటాయి. ప్రభుత్వ చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

సర్వేపల్లి నియోజకవర్గాన్ని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనే కొనసాగించినందుకు సీఎం వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి వెంకటాచలంలో భారీ ర్యాలీ నిర్వహించారు.ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణం సోమవారం జనసంద్రమైంది. కొత్తగా కనిగిరి రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుచేయడంతో పెద్దఎత్తున సంబరాలు జరిపారు. ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ భారీ ర్యాలీ నిర్వహించారు.

పవన్ పల్లకి మోసిన టీడీపీ ప్రభుత్వం కాదు, ప్రజల ఆకాంక్షలతో నడుస్తున్న ప్రభుత్వం మాది, మంచి చేసేప్పుడు మంచి అని చెప్పలేని వారు నోటికి తాళం వేసుకోవాలంటూ మంత్రి పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు

ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొత్తగా ఏర్పాటైన బాపట్ల, పల్నాడు జిల్లాల్లో భారీగా సభలు నిర్వహించారు. గుంటూరు లాడ్జి సెంటర్‌ నుంచి శంకర్‌ విలాస్‌ వరకు అభినందన ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యేలు మద్దాళి గిరిధర్, మహమ్మద్‌ ముస్తఫా, గుంటూరు మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడు, మిర్చి యార్డ్‌ చైర్మన్‌ ఏసురత్నం, ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్‌ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పాల్గొన్నారు.

ఉమ్మడి కృష్ణా జిల్లాను కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాలుగా మార్చడంతో మచిలీపట్నం, విజయవాడ కలెక్టరేట్‌లలో సందడి వాతావరణం జరిగింది. మచిలీపట్నం కేంద్రంగా ఏర్పడిన కృష్ణాజిల్లాకు కలెక్టర్‌గా రంజిత్‌ బాషా, విజయవాడ కేంద్రంగా ఏర్పడిన ఎన్టీఆర్‌ జిల్లాకు కలెక్టర్‌గా ఢిల్లీరావు బాధ్యతలు స్వీకరించారు.