AP Covid Update: ఏపీలో తాజాగా 18,336 మంది డిశ్చార్జ్, కొత్తగా 118 మంది మృతితో 10,022కి చేరుకున్న మొత్తం మరణాల సంఖ్య, తాజాగా 19,981 మందికి కరోనా, వ్యాక్సినేషన్‌పై మరోసారి ప్రధాని మోదీకి లేఖ రాసిన ఏపీ సీఎం వైయస్ జగన్
తూర్పుగోదావరి జిల్లాలో మరోసారి 3 వేలకు పైన కొత్త కేసులు వెల్లడయ్యాయి. రాష్ట్రంలో తాజాగా 18,336 మంది కోలుకున్నారు.
Amaravati, May 22: ఏపీలో గత 24 గంటల్లో 90,609 కరోనా పరీక్షలు నిర్వహించగా 19,981 మందికి పాజిటివ్ (Andhra Pradesh Covid) అని నిర్ధారణ అయింది. తూర్పుగోదావరి జిల్లాలో మరోసారి 3 వేలకు పైన కొత్త కేసులు వెల్లడయ్యాయి. రాష్ట్రంలో తాజాగా 18,336 మంది కోలుకున్నారు. ఇంకా 2,10,683 మందికి చికిత్స కొనసాగుతోంది. ఏపీలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 15,62,060కి (Covid in AP) చేరింది. 13,41,355 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు.
గడచిన 24 గంటల్లో వందకు పైగా మరణాలు సంభవించాయి. ఒక్కరోజులో 118 మంది (Covid Deaths) మృత్యువాతపడ్డారు. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 15 మంది, చిత్తూరు జిల్లాలో 14 మంది మరణించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 10 వేలు దాటింది. తాజా మరణాలతో కలిపి 10,022గా నమోదైంది. రాష్ట్రంలో నేటి వరకు 1,85,25,758 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.
Here's AP Covid Report
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) వ్యాక్సినేషన్‌పై మరోసారి ప్రధాని నరేంద్ర మోదీకి (PM Modi) లేఖ రాశారు. శనివారం రాసిన ఆ లేఖలో.. ‘‘అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలన్నది మా నిర్ణయం. వ్యాక్సిన్ల కొరత వల్ల కేవలం 45ఏళ్ల పైబడిన వాళ్లకే ఇస్తున్నాం. ప్రైవేట్ ఆస్పత్రులకు నేరుగా వ్యాక్సిన్ ఇవ్వడం తప్పుడు సంకేతాలిస్తోంది. ప్రైవేట్ ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా వ్యాక్సిన్ ధరను నిర్ణయిస్తున్నాయి. కొన్ని ఆస్పత్రుల్లో రూ.2వేల నుంచి 25వేల వరకు విక్రయిస్తున్నాయి. దీని వల్ల సామాన్య ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతోంది.
ఒక వైపు 45ఏళ్లు పైబడ్డ వాళ్లకే వ్యాక్సిన్ ఇవ్వలేకపోతున్నాం. 18 నుంచి 44 ఏళ్ల వారికి వ్యాక్సిన్ చేరాలంటే నెలలు పట్టేలా ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రైవేట్ ఆస్పత్రులకు వ్యాక్సిన్ ఇవ్వడం సరికాదు. దీని వల్ల సామాన్యులు వ్యాక్సిన్ తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ నియంత్రణ లేకపోతే వ్యాక్సిన్‌ను బ్లాక్ మార్కెట్ చేస్తారు. సరిపడా వ్యాక్సిన్ స్టాక్ ఉంటే.. ఎవరికైనా ఇవ్వొచ్చు. ఒక వైపు కొరత ఉంటే.. మరోవైపు ప్రైవేట్ ఆస్పత్రులకు ఎలా ఇస్తారు?. వ్యాక్సిన్‌లన్నీ కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్దే ఉండాలి. వ్యాక్సిన్‌లు బ్లాక్ మార్కెట్‌కు చేరకుండా కట్టడి చేయాలి ’’ అని ముఖ్యమంత్రి లేఖలో పేర్కొన్నారు.