Guntur Stampede: చంద్రబాబు ప్రచార పిచ్చికి పేదలు బలి, మరణాలన్నిటికి చంద్రబాబు బాధ్యత వహించాలి, బాధితులను పరామర్శించి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి రజిని
చంద్రబాబు ప్రచార యావకి ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమన్నారు.
Guntur, Jan 2: గుంటూరులో చంద్రన్న సంక్రాంతి కానుకల పంపణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగిన సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మంత్రి విడదల రజనీ. చంద్రబాబు ప్రచార యావకి ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు మంత్రి.
‘చంద్రబాబు నాయుడు ప్రచార యావకి ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోవటం చాలా బాధాకరం. ఏదో చేసేస్తున్నట్లు, ప్రచార ఆర్భాటాలు చేశారు. గత పది రోజులుగా ఇక్కడేదో పంచుతున్నారని ఒక ఫేక్ ప్రచారాలు చేశారు. ఈరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి కూడా గుంటూరు పరిసర ప్రాంతాల నుంచి వాహనాలు పెట్టి జనాలను మభ్యపెట్టి ఇక్కడి తీసుకొచ్చారు.
గోరంత ఇచ్చి కొండంత అని చెప్పుకునే ప్రయత్నంలో తొక్కిసలాట జరిగింది. కేజీ కందిపప్పు, అరకేజీ నూనె ఇచ్చి ఏదో అన్ని సరుకులు ఇచ్చినట్లు ప్రచారం చేసుకున్నారు. మొన్న కందుకూరులో 8 మంది మరణించారు. ఇప్పుడు గుంటూరులో ముగ్గురు. ఈ చావులన్నింటికీ కూడా చంద్రబాబు పూర్తి బాధ్యత వహించాలి ’అని టీడీపీ, చంద్రబాబుపై మండిపడ్డారు మంత్రి విడదల రజనీ.
అయితే ముఖ్యమంత్రి వైస్ జగన్ కూడా ఈ సంఘటన పై దిగ్బ్రాంతి వ్యక్తం చేసారని మంత్రి రజని తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున పరిహారం అందించాలని, గాయపడ్డవారికి రూ.50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిపారు మంత్రి రజని.