Yuvagalam padayatra Postponed: నారా లోకేశ్ యువగళం పాదయాత్ర వాయిదా, అక్టోబర్ 3న సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు విచారణ నేపథ్యంలో కీలక నిర్ణయం
చంద్రబాబు అరెస్టు, అనంతర పరిణామాల నేపథ్యంలో ఈనెల 9న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో పాదయాత్ర నిలిపివేసిన విషయం తెలిసిందే.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర పునఃప్రారంభ తేదీ వాయిదా పడింది. చంద్రబాబు అరెస్టు, అనంతర పరిణామాల నేపథ్యంలో ఈనెల 9న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో పాదయాత్ర నిలిపివేసిన విషయం తెలిసిందే. దాదాపు 20 రోజుల తర్వాత సెప్టెంబరు 29న రాత్రి 8.15 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు.
అయితే అక్టోబర్ 3న స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకి సంబంధించి సుప్రీంకోర్టులో వాదనలు ఉన్నందున యువగళం పాదయాత్ర పున:ప్రారంభ తేదీని వాయిదా వేసుకోవాలని పార్టీ ముఖ్య నేతలు లోకేశ్‌ని కోరారు. చంద్రబాబు కేసు విచారణ సందర్భంగా ఢిల్లీలో న్యాయవాదులతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుందని, పాదయాత్రలో ఉంటే సంప్రదింపులు కష్టమవుతాయని, లోకేశ్ ఢిల్లీలో ఉంటేనే మంచిదని వారు తమ అభిప్రాయాలను తెలియజేశారు.
పార్టీ నేతల అభిప్రాయాలతో ఏకీభవించిన లోకేశ్.. యువగళం పాదయాత్ర పున:ప్రారంభ తేదీని వాయిదా వేసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. త్వరలోనే నాయకులతో చర్చించి యువగళం పున:ప్రారంభ తేదీని ప్రకటించనున్నారు.