Vjy, Sep 28: ఏపీలో స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. అందులో చంద్రబాబుపై నమోదయిన కేసులో మా వాదన వినాలని విజ్ఞప్తి చేసింది.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు పాత్రపై ఎన్నో ఆధారాలున్నాయి.విద్యార్థులకు శిక్షణ ఇస్తామని కోట్ల కుంభకోణం చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. నిధులను షెల్ కంపెనీల ద్వారా రూటు మళ్లించి ఎన్‌క్యాష్ చేసుకున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పటికే ఈ అంశాన్ని దర్యాప్తు చేస్తున్నాయి. ఈ కేసులో మొదట సమాచారం ఇచ్చింది కేంద్ర పరిధిలోని GST శాఖ. దీనికి సంబంధించిన వాదనలు మీ ముందు ఉంచుతామని కేవియట్ పిటిషన్‌లో పేర్కొంది.
సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ అక్టోబర్ 3కి వాయిదా పడిన సంగతి విదితమే. చంద్రబాబు కేసు సుప్రీంకోర్టులో విచారణకు రాగానే.. న్యాయమూర్తి భట్టి ఈ కేసు విచారణకు సుముఖత వ్యక్తం చేయలేదు. నాట్ బిఫోర్ మీ అంటూ నిరాసక్తత వ్యక్తం చేసారు. దీంతో, చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే ఈ కేసును వెంటనే విచారణకు స్వీకరించాలని కోరారు. కానీ, మరో న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా జోక్యం చేసుకొని తన సహచర న్యాయమూర్తి భట్టి సుముఖంగా లేకపోవటంతో ఈ కేసును మరో బెంచ్‌కు బదిలీ చేస్తున్నట్లు వెల్లడించారు.