స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత పిటిషన్‌లను విచారించిన జడ్జిలపై సోషల్ మీడియా వేదికగా పలు దూషణలు పర్వం కొనసాగిన సంగతి విదితమే. ఈ మేరకు ఏపీ హైకోర్టులో ఇవాళ క్రిమినల్ కంటెంప్ట్ పిటిషన్‌పై విచారణ జరిగింది. పిటిషన్‌పై విచారణ నేపథ్యంలో.. టీడీపీ నేత బుద్దా వెంకన్న, గోరంట్ల బుచ్చయ్య చౌదరీ సహా 26 మందికి నోటీసులు జారీ చేయాలని బుధవారం హైకోర్టు ఏపీ డీజీపీని ఆదేశించింది.
క్యాంపెయిన్‌గా జడ్జిపై ట్రోలింగ్ చేశారని, ఇద్దరు హైకోర్టు జడ్జీలు, ఏసీబీ జడ్జి ఫ్యామిలీ టార్గెట్‌గా ట్రోలింగ్ నడిచిందని కోర్టు దృష్టికి అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ తీసుకువచ్చారు. దీంతో ట్రోల్ చేసిన సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించి.. ఆ 26 మందికి నోటీసులు ఇవ్వాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు. తదుపరి చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ.. నాలుగు వారాలకు పిటిషన్‌పై విచారణ వాయిదా వేసింది హైకోర్టు. అలాగే ప్రతివాదులుగా ఉన్న గూగుల్, ఎక్స్(ట్విటర్), ఫేస్‌బుక్‌కు కూడా నోటీసులు ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది.
మరోవైపు జడ్జీలపై అభ్యంతరకర పోస్టులపై రాష్ట్రపతి భవన్ పై స్పందించి పోస్ట్ లు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాష్ట్రపతి కార్యాలయం లేఖ రాసింది. తదనంతరం హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది ప్రభుత్వం. ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు.