Balineni Srinivasa Reddy Resigns YSRCP: వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, జనసేనలోకి వెళ్లనున్నట్లుగా వార్తలు
తన రాజీనామా లేఖను ఆయన పార్టీ అధినేత జగన్ కు పంపించారు. కొంత కాలంగా పార్టీ అధిష్ఠానంపై బాలినేని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు
Vjy, Sep 18: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన పార్టీ అధినేత జగన్ కు పంపించారు. కొంత కాలంగా పార్టీ అధిష్ఠానంపై బాలినేని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పలు సందర్భాల్లో పార్టీ నాయకత్వంపై ఆయన బహిరంగంగానే కామెంట్స్ చేశారు.
జగన్ విధానాలు నచ్చకే రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.ఇప్పటికే బాలినేని అనుచరులు చాలా మంది వైసీపీని వీడి టీడీపీలో చేరిపోయారు. బాలినేని ఒంగోలు నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఉమ్మడి ఏపీలో బాలినేని మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ ను వీడి ఆయన వైసీపీలో చేరారు. 2014లో వైసీపీ తరపున పోటీ చేసిన ఓటమిపాలయ్యారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున గెలుపొంది... రెండున్నరేళ్ల పాటు మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత మంత్రి పదవి దక్కకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.
మరోవైపు నిన్న జనసేన నేత నాగబాబును బాలినేని కలిసినట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలన్నింటి తర్వాత ఆయన వైసీపీని వీడారు. బాలినేని ఏ పార్టీలో చేరతారనే విషయంలో క్లారిటీ లేకపోయినప్పటికీ... డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా ఆయన జనసేనలో చేరే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఒంగోలులో బాలినేని మీడియాతో మాట్లాడారు. ‘‘కొన్ని రోజులుగా వైసీపీ అధిష్ఠానం వద్ద అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నాను. గురువారం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కలవబోతున్నారు. ఆ పార్టీలో చేరబోతున్నాను’’ అని బాలినేని తెలిపారు.