CM Jagan Delhi Tour: ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్ భేటీ, రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చలు, సుమారు 45 నిమిషాల పాటు సమావేశం, జూలై 8, 9న వైఎస్సార్‌సీపీ ప్లీనరీ
ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. సుమారు 45 నిమిషాల పాటు ఈ సమావేశం (Jagan Mohan Reddy meets PM Modi) కొనసాగింది.
Amaravati, June 2: ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) భేటీ ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. సుమారు 45 నిమిషాల పాటు ఈ సమావేశం (Jagan Mohan Reddy meets PM Modi) కొనసాగింది. సీఎం వైఎస్ జగన్ వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఉన్నారు. కాసేపట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం భేటీ కానున్నారు.
జూలై 8, 9న వైఎస్సార్‌సీపీ ప్లీనరీ: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని (YSR Birthday) పురస్కరించుకొని జూలై 8, 9 తేదీల్లో రెండు రోజులపాటు వైఎస్సార్‌సీపీ ప్లీనరీని నిర్వహించాలని ఆ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. అధికారంలోకి వచ్చాక తొలిసారిగా నిర్వహించే పార్టీ ప్లీనరీని గుంటూరు – విజయవాడ రహదారిపై నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో విశాలమైన ప్రాంగణంలో నిర్వహించనున్నారు. 2017 జూలై 8, 9న జరిపిన ప్రదేశంలోనే ఇప్పుడు కూడా ప్లీనరీ నిర్వహించాలని నిర్ణయించారు.
వైఎస్సార్‌సీపీ ప్లీనరీని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయిరెడ్డి చెప్పారు. ఆయన బుధవారం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, జిల్లా అధ్యక్షులు, కోఆర్డినేటర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. జూలై 8వ తేదీన ప్రారంభమై 9వ తేదీ సాయంత్రం వరకు ప్లీనరీ జరుగుతుందన్నారు. పార్టీ నేతలందరూ ప్లీనరీకి సమాయత్తం కావాలని కోరారు.
పార్టీ నేతలు, కార్యకర్తలు, అతిథులకు అన్ని సౌకర్యాలను కల్పించేందుకు ప్లీనరీ నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే ఎన్నికలను సమర్ధవంతంగా ఎదుర్కొనేలా అందరూ సమష్టిగా పనిచేయాలనేది సీఎం వైఎస్ జగన్ ఆకాంక్ష అని చెప్పారు. ఐకమత్యానికి పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని, వర్గాలను ప్రోత్సహించే పరిస్థితి ఉండదని స్పష్టంచేశారు. దీనిని గుర్తించి నేతలందరూ ఐకమత్యంతో ముందుకు నడవాలని చెప్పారు.
పార్టీ కమిటీలకు పేర్లు సూచించండి
పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ కమిటీలకు పేర్లు సూచించాలని చెప్పారు. పార్టీ నియమ నిబంధనలకు అనుగుణంగా అంకితభావంతో పనిచేసే వారికి స్ధానం లభిస్తుందని అన్నారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌తో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు తగిన ప్రాతినిధ్యం ఉంటుందని తెలిపారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని పార్టీ శాసన సభ్యులు, నియోజకవర్గాల ఇన్‌చార్జిలు పార్టీ పటిష్టత కోసం పాటు పడే వారిని సూచించాలనేది సీఎం జగన్ ఆకాంక్ష అని వివరించారు.
ఈ పేర్లను జూన్ పదో తేదీ నాటికి జిల్లా అధ్యక్షుల ద్వారా పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపాలన్నారు. జిల్లా అధ్యక్షులు కూడా పార్టీ కమిటీలపై ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలను సమావేశపరిచి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకోవాలని తెలిపారు. అనంతరం కమిటీల నిర్మాణం చూడాలన్నారు. రీజనల్ కోఆర్డినేటర్లు కూడా వారి పరిధిలోని జిల్లా అధ్యక్షులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. నూతన కమిటీలను ప్లీనరీలో ప్రకటిస్తారని వివరించారు. సచివాలయాల సందర్శన కార్యక్రమం అనంతరం బూత్ కమిటీలకు కూడా పేర్లను పంపాలని కోరారు.