Representational Image (Photo Credits: PTI)

Amaravati, June 2: ఏపీలో టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలపై విద్యార్థులకు ర్యాంకులు అంటూ ప్రకటనలు చేసే ప్రైవేటు విద్యాసంస్థలు, ట్యుటోరియల్‌ సంస్థలపై చర్యలు తప్పవని పాఠశాల విద్యాశాఖ (school education department) హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించి ప్రకటనలు చేస్తే ఆయా సంస్థల యాజమాన్యాలు, ఇతరులకు మూడేళ్లనుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షతోపాటు రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారని స్పష్టం చేసింది. ఈమేరకు విద్యార్థులు, తల్లిదండ్రుల ప్రయోజనాల పరిరక్షణ దృష్ట్యా ఎస్సెస్సీ పబ్లిక్‌ పరీక్షల్లో ర్యాంకులతో ప్రకటనలు జారీచేయడాన్ని ( rank announcement in tenth results) నిషేధిస్తూ పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌ బుధవారం 83వ నంబరు జీవో జారీచేశారు.

ఎస్సెస్సీ పబ్లిక్‌ పరీక్షల్లో గతంలో గ్రేడింగ్‌ విధానంలో ఫలితాలను ప్రకటించే వారు. 2020 నుంచి గ్రేడ్లకు బదులు విద్యార్థులకు మార్కులు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థలు, ట్యుటోరియల్‌ విద్యాసంస్థలు విద్యార్థులకు ర్యాంకులను ఆపాదిస్తూ తమ సంస్థకే ఉత్తమ ర్యాంకులు, అత్యధిక ర్యాంకులు వచ్చాయంటూ ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియాలో తప్పుడు ప్రకటనలు చేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులను పక్కదారి పట్టిస్తున్నాయి. ఇలాంటి అక్రమాలతో ఆయా విద్యాసంస్థలు విద్యార్థులు, తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించకుండా చర్యలు తీసుకోవాలని, వీటివల్ల విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతారని పలువురు పాఠశాల విద్యాశాఖకు వినతులు ఇచ్చారు.

తెలుగుదేశం పార్టీకి దివ్యవాణి రాజీనామా, ఇలాంటి రోజు వస్తుందని భావించలేదని కన్నీరు పెట్టుకున్న సినీనటి దివ్యవాణి

దీనిపై స్పందించిన ఏపీ విద్యాశాఖ ఏపీ పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ యాక్ట్‌–1997 ప్రకారం ఇటువంటి మాల్‌ప్రాక్టీస్, తప్పుడు ప్రకటనలను చేసే వారికి ఏడేళ్ల వరకు జైలు, రూ.లక్ష వరకు జరిమానా విధించనున్నారు. టెన్త్‌ పరీక్షల్లో గ్రేడ్లకు బదులు మార్కులతో ఫలితాలను ప్రకటించనున్నందున ఆయా సంస్థలు ర్యాంకులతో తప్పుడు ప్రకటనలు చేయరాదని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. విద్యాసంస్థలు ఏ రూపంలోను, ఏ స్థాయిలోను ర్యాంకులతో ఇలాంటి ప్రకటనలు చేయడానికి వీల్లేదని, ఈ దిశగా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ను ఆదేశించారు.

ఏప్రిల్‌ 27వ తేదీ నుంచి మే 9వ తేదీవరకు నిర్వహించిన టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు ఈవారంలోనే విడుదలయ్యే అవకాశముంది. మూల్యాంకనాన్ని ముగించిన ఎస్సెస్సీ బోర్డు ఆ వివరాల కంప్యూటరీకరణ వంటి తదుపరి కార్యక్రమాల్లో నిమగ్నమైంది. టెన్త్‌ ఫలితాలను పదో తేదీలోపు విడుదల చేయాలన్న అభిప్రాయంతో ఉన్న బోర్డు వాటిని ఈ వారంలోనే ప్రకటించేలా చర్యలు చేపట్టింది.