CM YS Jagan VC Highlights: రుయా ఘటనపై ఏపీ సీఎం విచారం, మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్ట పరిహారం, ప్రతిపక్షాల కరోనా రాజకీయాలపై ఆగ్రహం, స్పందన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన వైయస్ జగన్
ఈ 22 నెలల కాలంలోనే ఒక్క బటన్ నొక్కితే ఎలాంటి అవినీతికి, వివక్షకు తావులేకుండా రూ. 87వేల కోట్ల రూపాయలు పేదలకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల ద్వారానే ఇవ్వగలిగాం. ఇలాంటి ప్రభుత్వం రూ.1600 కోట్లు ఖర్చు చేయడానికి వ్యాక్సిన్లు ఇవ్వడానికి వెనకాడుతుందా?’’ అని సీఎం అన్నారు.
Hyderabad, May 11: స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లాల కలెక్టర్లతో తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy ) మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ (Video Conference With Collectors) నిర్వహించారు. కరోనా కట్టడి చర్యలపై కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు. కోవిడ్, ఉపాధి హామీ పనులు, వైఎస్సార్ జలకళ, వైఎస్సార్ అర్బన్ క్లినిక్స్, హౌసింగ్, స్పందనకు వచ్చిన వినతులు, ఖరీఫ్‌కు సన్నద్ధతపై సీఎం సమీక్షించారు.
కరోనాతో (Coronavirus) కలిసి జీవించాల్సిన పరిస్థితుల్లో ఉన్నామని సీఎం వైఎస్ జగన్ అన్నారు. బాధాకరమైన ఘటనలు కూడా జరుగుతున్నాయని.. నిన్న రుయా ఆస్పత్రిలో జరిగిన ఘటన తీవ్రంగా కలచి వేసిందన్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారాన్ని సీఎం (AP CM YS jagan) ప్రకటించారు. మనం ఎంత కష్టపడుతున్నా, ప్రయత్నాలు చేస్తున్నా కూడా కొన్ని కొన్ని మన చేతుల్లో లేని అంశాలకు కూడా మనం బాధ్యత వహించాల్సి వస్తోందన్నారు.
కాగా తమిళనాడు నుంచి రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్ సరైన సమయానికి రాలేకపోయినందున, ఆక్సిజన్ కొరత ఏర్పడిందని.. ఈ ఆలస్యం వల్లే 11 మంది చనిపోయారని అధికారులు చెప్పారు. ఈ ఘటనపై వెంటనే పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కలెక్టర్ హరినారాయణన్ విచారణ చేపట్టారు. చెన్నై నుంచి ఆక్సిజన్ ట్యాంకర్ ఆలస్యంతో ఇబ్బంది తలెత్తిందని కలెక్టర్ వెల్లడించారు. వెంటనే ఆక్సిజన్ పునరుద్ధరించడం వల్ల చాలా మందిని రక్షించామని తెలిపారు.
Here's AP CMO Tweet
సీఎం జగన్ స్పందిస్తూ.. ఆక్సిజన్ పరిస్థితి ఏ స్థాయిలో ఉందంటే నిన్నకూడా ఆరు ట్యాంకర్లను గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఒడిశాకు విమానంలో పంపాం. రవాణా సమయాన్ని ఆదా చేయడానికి ఎయిర్ లిఫ్ట్ చేశాం. అక్కడ నింపి... రోడ్డు మార్గంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. విదేశాల్లో కూడా ఆక్సిజన్ కొనుగోలు చేసి షిప్స్ ద్వారా తెప్పిస్తున్నాం.
ఇన్నిరకాలుగా ఆక్సిజన్ కొరత రాకుండా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇన్ని ప్రయత్నాలు చేస్తున్న కూడా కొన్ని కొన్ని మన చేతుల్లో లేకపోవడంవల్ల నష్టాలు జరుగుతున్నాయి. కలెక్టర్లందరికీ కూడా చెప్తున్నా... చాలా అప్రమత్తతతో వ్యవహరించాలి. ఇంకా మానవత్వం చూపించాల్సిన అవసరం ఉంది. కోవిడ్ కారణంగా నెలకొన్న సమస్యలను మానవత్వంతో ఎదుర్కోవాల్సి ఉందని’’ సీఎం అన్నారు.
18 ఏళ్లకు పైబడ్డ వారికి వ్యాక్సిన్ ఇవ్వడానికి 172 కోట్ల డోసులు దేశానికి అవసరమైతే ఇప్పటి వరకూ కేవలం 17 కోట్లు డోసులు మాత్రమే ఉత్పత్తి అయిన పరిస్థితి కనిపిస్తోంది. 45 సంవత్సరాలు పైచిలుకు ఉన్నవారు రాష్ట్రంలో 1.48 కోట్ల మంది ఉన్నారు. వీరికి 2 డోసులు చొప్పున దాదాపు 3 కోట్లు డోసులు ఇవ్వాలి. 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉన్న వారు రాష్ట్రంలో 2 కోట్ల మంది జనాభా సుమారుగా ఉన్నారు. వీరికి దాదాపు 4 కోట్ల డోసులు అవసరం. అంటే 18 ఏళ్ల పైబడి రాష్ట్రంలో ఉన్నవారికి వ్యాక్సిన్లు ఇవ్వాలంటే దాదాపు 7 కోట్ల డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటివరకూ 73 లక్షల డోసులు మాత్రమే కేంద్రం నుంచి మనకు అందాయి. ఈ పరిస్థితి ఉందని అందరికీ తెలుసని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.
డబ్బులు తీసుకుని మాకు సప్లైచేయండని కోరినా సరే కంపెనీలు తీసుకోవడం లేదు. వ్యాక్సిన్ల పంపిణీ అన్నది కేంద్రం నియంత్రణలో ఉంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో కేంద్రం కూడా అఫడవిట్‌కూడా దాఖలు చేసింది. జనాభా ప్రాతిపదికన కోటాను నిర్దారిస్తామని అఫడవిట్లో పేర్కొందని గుర్తు చేశారు. దీన్ని ప్రతిపక్షం రాజకీయం చేస్తోందని ప్రజల్లో అలజడిని రేకెత్తించడానికి, భయాందోళనలు సృష్టించడానికి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని’’ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
మన తప్పు కాకపోయినా, పక్కరాష్ట్రం నుంచి రావాల్సిన ట్యాంకర్ సకాలానికి రాకపోయినా సరే ... బాధ్యత తీసుకుని నిన్నటి రుయా ఘటనలో మరణించిన కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశిస్తున్నాం. వారి కుటుంబాల దగ్గరకు వెళ్లి పరిహారం ఇవ్వండి, వారి బాసటగా ఉండండి. తప్పులు మళ్లీ జరక్కుండా... భవిష్యత్తులో, ఇంకా ఎలా చేయగలుగుతాం అన్నదానిపై దృష్టిపెట్టాలి. తప్పును ఒప్పుకోవడం అన్నది చిన్నతనం కాదు.
కోవిడ్ విషయంలో మనం అత్యంత పారదర్శకంగా ప్రతి అడుగులోనూ వ్యవహరించాం. ఈ 22 నెలల కాలంలోనే ఒక్క బటన్ నొక్కితే ఎలాంటి అవినీతికి, వివక్షకు తావులేకుండా రూ. 87వేల కోట్ల రూపాయలు పేదలకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల ద్వారానే ఇవ్వగలిగాం. ఇలాంటి ప్రభుత్వం రూ.1600 కోట్లు ఖర్చు చేయడానికి వ్యాక్సిన్లు ఇవ్వడానికి వెనకాడుతుందా?’’ అని సీఎం అన్నారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)