Amaravati, May 10: ఆంధ్రప్రదేశ్‌లో 104 వ్యవస్థను (104 system in Andhra Pradesh) మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. అధికారులు నిత్యం మాక్ కాల్స్ చేసి పని తీరు పర్యవేక్షించాలన్నారు.కోవిడ్ ప్రత్యేక అధికారులతో సీఎం సమీక్ష (YS Jagan Review on Covid) నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు ఆదేశాలు, సూచనలు (Chief Minister directed the authorities ) చేశారు. 104కి కాల్ చేసిన వెంటనే కచ్చితంగా స్పందన ఉండాలని అవసరమైన వారికి బెడ్ కేటాయించేలా చూడాలని స్పష్టం చేశారు. రద్దీ ఉన్న జిల్లాల్లో బెడ్ల సంఖ్యను గణనీయంగా పెంచాలని ఆదేశించారు.
ఆక్సిజన్ సహా కావాల్సిన మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా కల్పించండి.104కు కాల్ చేస్తే ఫోన్ కలవలేదని, స్పందన లేదన్న మాట ఎక్కడా వినిపించకూడదు. బెడ్ అవసరం లేదన్న వారిని కోవిడ్ కేర్ సెంటర్లకు పంపించాలి. 104కు కాల్ చేసిన తర్వాత కోవిడ్ బాధితులకు కచ్చితంగా సహాయం అందాలి. నిర్ణయించుకున్న ఆస్పత్రుల్లో జర్మన్ హేంగర్స్‌ను వెంటనే ఏర్పాటు చేయాలి. దీని వల్ల పేషెంట్లు బయట వేచి చూసే పరిస్థితులు తప్పుతాయి. అంతే కాక సత్వరమే వారికి వైద్యం అందుతుందని’ సీఎం పేర్కొన్నారు.
‘ప్రతి ఆస్పత్రిలో కూడా ఆరోగ్య మిత్ర ఉండాలి. ఎవరైనా, ఏదైనా సమస్య ఎదుర్కొంటే ఫిర్యాదు చేయడానికి ప్రతి ఆస్పత్రిలో కూడా నంబర్ డిస్ ప్లే చేయాలి. వ్యాక్సినేషన్‌కు సంబంధించి ప్రస్తుతం ఉన్న పరిస్థితులను కూడా ప్రజలకు స్పష్టంగా చెప్పాలి. వ్యాక్సినేషన్ అనేది కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉంది. రాష్ట్రం నేరుగా వ్యాక్సిన్లు కొనుగోలు చేయాలనుకున్నా, ఎన్ని అమ్మాలో కేంద్రమే కంపెనీలకు నిర్దేశిస్తోంది. ఏ రాష్ట్రానికి ఎన్ని వ్యాక్సిన్లు అమ్మాలనే విషయాన్ని కేంద్రమే నిర్ణయిస్తోంది. కేంద్రం నిర్ణయించిన కోటా మేరకే కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
అది కూడా డబ్బును ముందుస్తుగా చెల్లించాల్సి ఉంటుంది. వ్యాక్సిన్ల ఉత్పత్తి, వాటి లభ్యత అనేవి రాష్ట్రం పరిధిలోని అంశాలు కావని, ఇవి కేంద్రం నియంత్రణలో ఉన్నాయన్న విషయం అందరికీ తెలుసు. అయినా, ఈ విషయాలన్నీ తెలిసి కూడా రాష్ట్రంలోని రాజకీయ వ్యవస్థలో ఉన్న కొందరు వ్యక్తులు, ఓ వర్గం మీడియా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తోంది. దురుద్దేశ పూర్వకంగా ఈ ప్రచారాలు చేస్తున్నారు. కావాలనే ప్రజల్లో ఆందోళనను, భయాన్ని సృష్టిస్తున్నారని’ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నెలకు కోటి వ్యాక్సిన్లు రాష్ట్రానికి సరఫరా అయ్యే పరిస్థితి భవిష్యత్తులో ఉంటే, రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియకు కనీసం 6 నెలలు పడుతోందని సీఎం తెలిపారు. ప్రస్తుతం ప్రస్తుతం సగటున నెలకు 19 లక్షలకు పైగా డోసులు మాత్రమే వస్తున్నాయన్నారు. వ్యాక్సిన్ల కొనుగోలుపై గ్లోబల్ టెండర్లకు వెళ్లే ఆలోచన చేయాలని సీఎం సూచించారు. అధికారులు అంతా కూర్చుని దీనిపై పరిశీలన చేసి నిర్ణయం తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
వ్యాక్సిన్ సెంటర్ల వద్ద, రద్దీ, తోపులాట పరిస్థితులు కనిపించకూడదు. వ్యాక్సిన్ ఎవరికి వేస్తారన్నదానిపై ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు స్పష్టంగా చెప్పాలి. దీనివల్ల వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద క్యూలు ఉండే పరిస్థితిని నివారించవచ్చు. వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద కుర్చీలు ఏర్పాటు చేసి, టీకా తీసుకునేవారికి సౌకర్యంగా ఉండేలా చూడాలి. అందిరికీ వ్యాక్సిన్ అందుతుందని, ప్రతి ఒక్కరికీ ఈ ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తుందనే విషయాన్ని ప్రజలకు చెప్పాలి. 45 ఏళ్లకు పైబడి మొదటి డోస్ తీసుకుని, రెండో డోస్ కోసం వేచి చూస్తున్న వారికి వెంటనే వ్యాక్సిన్ అందించేలా చూడాలి. వీరికి వ్యాక్సిన్ పూరైన తర్వాత 45 ఏళ్ల పైబడ్డ వారికి వ్యాక్సిన్లు ఇవ్వడంపై దృష్టిపెట్టాలని సీఎం తెలిపారు.
45 ఏళ్ల పైబడ్డ వారిపై కోవిడ్ ప్రభావం అధికంగా ఉన్నందున ముందు ఈ కేటగిరిలో ఉన్న వారిపై దృష్టిపెట్టాలి. జ్వరం వస్తే దాన్ని కోవిడ్ లక్షణంగా చూసి, వెంటనే మందులు ఇచ్చేలా చూడాలని, వైద్య నిపుణులు ఆ మేరకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని’’ సీఎం ఆదేశించారు. కమ్యూనిటీ ఆస్పత్రుల నుంచి బోధనాసుపత్రుల్లో పీఎస్‌ఏ ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని, ఈ మేరకు కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. సత్వరమే వాటి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.
రెమ్డెసివిర్ ఇంజక్షన్లు బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. దీనిపై ఆడిట్ తప్పనిసరిగా ఉండాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో వినియోగంపై ఆడిటింగ్ ఉండాలని సీఎం పేర్కొన్నారు. రోగులకు అందుబాటులో ఉంచాలని, ఇంజక్షన్ల పేరిట రోగులను దోచుకునే వ్యవహారాలకు అడ్డుకట్ట వేయాలని సీఎం ఆదేశించారు.
రాష్ట్రంలో కర్ఫ్యూ అమలవుతున్న తీరుపై ప్రతి జిల్లా నుంచి ప్రతి రోజూ నివేదిక ఇవ్వాలని డీజీపీకి సూచించారు. నిర్దేశించిన సమయంలో కర్ఫ్యూ అమలు చేయాలని సీఎం ఆదేశించారు. జిల్లాల్లో ప్రతి బుధవారం కోవిడ్ రివ్యూ కమిటీలు సమావేశం కావాలన్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను ప్రజా ప్రతినిధులు అధికారులకు వివరించే అవకాశం కలుగుతుందని.. ఈ సమావేశంలో అందుతున్న ఫీడ్‌బ్యాక్‌ను పరిశీలించి సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.