Amaravati, May 9: వైఎస్సార్ జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లెలో డిటోనేటర్లు, జిలెటిన్ స్టిక్స్ భారీ శబ్దంతో పేలడంతో ముగ్గురాళ్ల క్వారీలో పనిచేయడానికి వచ్చిన 10 మంది కూలీలు అక్కడికక్కడే మరణించిన సంగతి విదితమే. ఈ పేలుడు ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు (high-level inquiry into Mamillapalle blast ) ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 5 ప్రభుత్వ శాఖలతో విచారణ కమిటీ ఏర్పాటు చేసింది.
కడప జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) ఆధ్వర్యంలో మైనింగ్, రెవెన్యూ, పోలీస్, మైన్స్, సేఫ్టీ, ఎక్ల్ ప్లోజీవ్స్ శాఖలకు చెందిన అధికారులతో ఏర్పాటు చేసిన ఈ విచారణ కమిటీ అయిదు రోజుల్లో తన నివేదికను ప్రభుత్వానికి అందచేస్తుందని రాష్ట్ర గనులు, భూగర్భశాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Andhra Pradesh Mining Minister peddireddy ramachandrareddy) తెలిపారు.
ఈ ఘటనలో పది మంది మృత్యువాత పడటం పట్ల (Mamillapalli Blast) ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పేలుడు ఘటనలో మృతి చెందిన వారికి తక్షణ నష్టపరిహారంగా రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ.ఐదు లక్షలు అందజేస్తామని మంత్రి వెల్లడించారు. డీఎంజీ నేతృత్వంలో ఘటనా స్థలాన్ని మైనింగ్ అధికారులు పరిశీలించారని, లీజుదారుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
క్వారీ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు గుర్తించామని ఆయన పేర్కొన్నారు. పేలుడు పదార్థాల అన్‌లోడింగ్‌లో నిబంధనలు పాటించలేదన్నారు. చిన్న తరహా ఖనిజ నియమావళి చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు.
ఘటన వివరాల్లోకెళితే.. వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం చెంచయ్యగారిపల్లెకు చెందిన నాగేశ్వరరెడ్డి మామిళ్లపల్లె గ్రామ శివారులో తిరుమల కొండస్వామి తిప్పపై ముగ్గురాళ్ల క్వారీని నిర్వహిస్తున్నారు. ఇక్కడ ముగ్గురాళ్లను పగులగొట్టేందుకు పులివెందుల నుంచి జిలెటిన్ స్టిక్స్, ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు (ఈడీ) కారులో తీసుకువచ్చారు. కూలీలు వీటిని కారులో నుంచి తీసే సమయంలో ప్రమాదవశాత్తు డిటోనేటర్లు, జిలెటిన్ స్టిక్స్ భారీ శబ్దంతో ఒక్కసారిగా పేలాయి.
దీంతో కారు డ్రైవర్, తొమ్మిది మంది కూలీలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. డిటోనేటర్లను కారు నుంచి దింపుతున్న సమయంలో ఇద్దరు కూలీలు తాగునీటి కోసం బయటకు వెళ్లడంతో ప్రాణాలు దక్కించుకున్నారు. కాగా పేలుడు శబ్దం దాదాపు పది కిలోమీటర్ల వరకు వినిపించడంతో సమీప గ్రామాలైన మామిళ్లపల్లె, మహానందిపల్లె, అక్కివారిపల్లె, ముదిరెడ్డిపల్లె, కలసపాడులతోపాటు మరో 15 గ్రామాల ప్రజలు భూకంపం వచ్చిందేమోనని వణికిపోయారు.
ప్రమాదంలో మరణించిన పది మందిలో ఏడుగురు వైఎస్సార్ జిల్లా వేముల మండలానికి చెందినవారు కాగా మిగతా ముగ్గురు కలసపాడు, పోరుమామిళ్ల, వేంపల్లె మండలాల వారిగా గుర్తించారు. పేలుడు ఘటనపై సమాచారం తెలిసిన వెంటనే వైఎస్సార్ జిల్లా ఎస్పీ అన్బురాజన్, మైదుకూరు డీఎస్పీ శ్రీనివాసులు, పోరుమామిళ్ల సీఐ మోహన్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బద్వేలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, బద్వేలు మార్కెట్ యార్డు చైర్మన్ రమణారెడ్డి కూడా ఘటనాస్థలికి వెళ్లి సమీప గ్రామాల ప్రజలు, ప్రాణాలతో తప్పించుకున్న ఇద్దరు కూలీల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున నష్టపరిహారం అందించనున్నట్లు వైఎస్సార్ జిల్లా గనులు, భూగర్భ శాఖ సహాయ సంచాలకులు రవిప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.ముగ్గురాయి క్వారీలో జరిగిన పేలుడులో పది మంది మృత్యువాత పడటంపై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ఉన్నతాధికారులను అడిగి ఘటన ఎలా జరిగిందో తెలుసుకున్నారు. క్షతగ్రాతులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.