Amaravati, May 9: కరోనా నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ (Andhra Pradesh DGP Gautam Sawang) అన్నారు. విజయవాడ నగరంలో ఆయన ఆదివారం ఆకస్మికంగా పర్యటించారు. కర్ఫ్యూ (AP Curfew) అమలును పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ప్రతి ఒక్కరూ సామాజిక దూరం, డబుల్ మాస్క్ లాంటి జాగ్రత్తలు పాటించాలని కోరారు. శానిటైజర్ ఉపయోగించాలని సూచించారు. జాగ్రత్తలు పాటించడం ద్వారానే కరోనాను జయిస్తామని పేర్కొన్నారు.
కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ( stern action against those violating curfew) తప్పవని ఆయన హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించేవారి కోసం రేపటి నుంచి ఈ-పాస్ విధానం అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. రాజకీయ పార్టీల సభలు, సమావేశాలకు అనుమతి లేదని డీజీపీ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకు సూచించారు.
కరోనా లక్షణాలను గుర్తించిన వారు, హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న వారు ప్రభుత్వం అందుబాటులో ఉంచిన 104, 108 సేవలను వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని డీజీపీ పేర్కొన్నారు. శుభ కార్యాలకు సంబంధించి ప్రభుత్వం పేర్కొన్న సంబంధిత స్థానిక అధికారుల వద్ద నిబంధనల మేరకు తప్పనిసరిగా అనుమతి పొందాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.
ప్రజల్లో సెల్ఫ్ డిసిప్లీన్ ఉందన్నారు. అందరూ నిత్యవసరాల కోసమే బయటకి రావాలని చెప్పారు. కర్ఫ్యూ ఎలా పాటిస్తున్నారో పరిశీలించామన్నారు. కొన్నిరోజులు ఇలాంటి జాగ్రత్తలు పాటించాలన్నారు. కొన్నిరోజుల్లో కోవిడ్ నుంచీ బయటపడుతామన్నారు. బయటకు వచ్చేవారి వాహనాలపై కఠిన చర్యలుంటాయని డీజిపీ గౌతం సవాంగ్ హెచ్చరించారు.
కాగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నోటీసులు జారీ చేయడంపై డీజీపీ స్పందించారు. రాజకీయాలకు ఇది సమయం కాదన్నారు. రాజకీయ పరమైన వదంతులు ఎవరూ తీసుకు రావద్దని హితవు పలికారు. అందరూ బాధ్యతగా కోవిడ్ నుంచీ బయటపడేందుకు ఒక కుటుంబంగా పని చేయాలని డీజిపీ గౌతం సవాంగ్ తెలిపారు.