Amaravati, May 9: పుణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి బయలుదేరిన 3లక్షల 60 వేల వ్యాక్సిన్లు ఆదివారం ఉదయం కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి. ఎయిర్ పోర్టుకు చేరుకున్న కొవిషీల్డ్ టీకా డోసులను (Covishield Vaccines) అధికారులు రోడ్డు మార్గంలో తొలుత గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల ఆదేశాలతో వ్యాక్సిన్లు జిల్లాలకు తరలివెళ్లనున్నాయి.
కరోనా బాధితులకు ఆక్సిజన్ సరఫరా చాలా కీలకమైనందున.. దీన్ని సమర్థంగా నిర్వహించడం కోసం 9 మంది సభ్యులతో మానిటరింగ్ కమిటీని (Monitoring Committee) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులిచ్చింది. ప్రస్తుతం ఆక్సిజన్ ఎంత కావాలి? భవిష్యత్ అవసరాలకు ఎంత అవసరం.. అనే అంశాలను పరిశీలించడంతో పాటు.. ఎలాంటి అంతరాయం లేకుండా ఆక్సిజన్ సరఫరా అయ్యేలా ఈ కమిటీ చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ పేర్కొన్నారు.
ఐఏఎస్ అధికారులు ఢిల్లీ రావు, రాజాబాబుతో పాటు పరిశ్రమలశాఖకు చెందిన డీడీ ఎం.సుధాకర్‌బాబు, ముగ్గురు కన్సల్టెంట్లు, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ అవినాష్‌రెడ్డి, రవాణా శాఖ నుంచి ఆర్టీఏ పుమేంద్ర, ఎంవీఐ ప్రవీణ్‌లతో ఈ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రత్యేక అధికారి షాన్ మోహన్‌కు వీరంతా రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.