House Site Distribution: ఒక్క రూపాయి చెల్లింపుతో టిడ్కో ఇల్లు, డిసెంబర్ 25న ఇళ్ల పట్టాల పంపిణీ, పేదల ఇళ్ల నిర్మాణానికి ఇసుక ఉచితం, స్పందన కార్యక్రమంలో ఏపీ సీఎం వైయస్ జగన్ నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ (House Site Distribution) కార్యక్రమాన్ని డిసెంబర్ 25వ తేదీన ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) అధికారులను ఆదేశించారు.
Amaravati, Nov 19: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ (House Site Distribution) కార్యక్రమాన్ని డిసెంబర్ 25వ తేదీన ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) అధికారులను ఆదేశించారు. కోర్టు స్టేలు ఉన్న చోట మినహా, మిగతా అన్ని చోట్ల ఈ కార్యక్రమాన్ని (Distribution of house site pattas) చేపట్టాలని సూచించారు. ఈ స్కీమ్ కింద అర్హులైన లబ్ధిదారులందరికీ డి–ఫామ్ పట్టా ఇచ్చి, ఇంటి స్థలం కేటాయించాలని స్పష్టం చేశారు.
పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ ఏర్పాట్లు, ఇళ్ల నిర్మాణాలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో రివ్యూ నిర్వహించారు. ఈ స్పందన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలకు మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..డిసెంబర్ 25 తొలి దశలో దాదాపు 15.10 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 30,68,281 మంది లబ్ధిదారులను ఇళ్ల స్థలాల కోసం గుర్తించామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల నుంచే ఈ కార్యక్రమం మొదలు పెట్టామని, గిట్టని వాళ్లు కోర్టులకు వెళ్లి.. పేదలకు ఇంటి స్థలం ఇవ్వకుండా రాజకీయం చేస్తున్నారని చెప్పారు.
తొలుత మార్చి 25న ఉగాది రోజు పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలనుకున్నా ప్రతిపక్షం చేసిన రాజకీయంతో అది వాయిదా పడింది. ఆ తర్వాత ఏప్రిల్ 14 అంబేడ్కర్ జయంతి రోజున, ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తైన సందర్భంగా మే 30న, దివంగత నేత వైఎస్సార్ జయంతి రోజు జూలై 8న, ఆ తర్వాత ఆగస్టు 15న, చివరగా అక్టోబరు 2 గాంధీ జయంతి రోజున అనుకున్నా వాయిదా పడుతూ వచ్చిందని ఏపీ సీఎం తెలిపారు.
ఇళ్ల స్థలాల కోసం 66,518 ఎకరాలు సేకరించాం. వాటి మార్కెట్ విలువ రూ.23 వేల కోట్లు. మొత్తం 30,68,821 మంది పేదలకు డిసెంబర్ 25న పంచబోతున్నాం. దరఖాస్తు చేసుకుంటే అర్హులకు 90 రోజుల్లో ఇస్తామన్నాం. ఆ మేరకు 1.20 లక్షల మందిని కొత్తగా జాబితాలో చేర్చాం. ఇందులో 80 వేల మంది కోసం కొత్తగా భూసేకరణ చేయాల్సి ఉంది. కాబట్టి వేగంగా ఆ పని చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
డిసెంబర్ 10వ తేదీ లోగా భూసేకరణతో పాటు, ప్లాట్ల గుర్తింపు 100 శాతం పూర్తి కావాలని.. అర్హులైన లబ్ధిదారులు ఇంకా ఎక్కడైనా మిగిలిపోతే, వారినీ కొత్తగా జాబితాలో చేర్చాలని సూచించారు. వచ్చే నెల 25న ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే నాటికి ఇంటి నిర్మాణాలకు సంబంధించిన లబ్ధిదారుల జియో ట్యాగింగ్ పూర్తి కావాలి. పథకాన్ని అమలు చేసేందుకు ఆ రోజు నాటికి కలెక్టర్లు సిద్ధంగా ఉండాలి. కోర్టు స్టేలు ఉన్న చోట వాటిని వెకేట్ చేయించుకునేలా కలెక్టర్లు గట్టి ప్రయత్నం చేయాలని సీఎం తెలిపారు.
పేదల ఇళ్ల నిర్మాణానికి ఇసుక ఉచితంగా సరఫరా చేస్తారు. 67.50 లక్షల టన్నుల సిమెంట్, 7.20 లక్షల టన్నుల ఇనుము అవసరం అవుతుంది. ఈ ఇళ్ల నిర్మాణం వల్ల 21 కోట్ల పని దినాలు లభించనున్నాయి. మెటీరియల్ ఇస్తాం. లేబర్ కాంపొనెంట్ వారికే ఇస్తాం. ఆ విధంగా దగ్గరుండి పేదలకు ఇళ్లు కట్టించి ఇస్తామని ఏపీ సీఎం అన్నారు.
ఒక్క రూపాయి చెల్లింపుతో టిడ్కో ఇల్లు
ఒకే ఒక్క రూపాయి చెల్లింపుతో ఏపీ టిడ్కో (ఆంధ్రప్రదేశ్ టౌన్‌షిప్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) ఇంటిని లబ్ధిదారులకు అప్పగిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. టిడ్కో ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 2,62,200 ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. ఇందులో ఇప్పటికే 300 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఇళ్లు 1,43,600 నిర్మాణంలో ఉన్నాయని, 365 చదరపు అడుగుల్లో 44,300 ఇళ్లు, 430 చదరపు అడుగుల్లో 74,300 ఇళ్ల నిర్మాణం జరుగుతోందని చెప్పారు. టిడ్కోకు సంబంధించి గత ప్రభుత్వం రూ.3,200 కోట్లు బకాయి పెట్టి పోయిందన్నారు. ఒక వైపు ఆ బకాయిలు తీరుస్తూనే, మన ప్రభుత్వం వచ్చాక ప్రజల కోసం ఇప్పటికే రూ.1,200 కోట్లు ఇచ్చామని, ఈ వారంలో మరో రూ.400 కోట్లు, 15 రోజుల్లో ఇంకో రూ.600 కోట్లు ఇస్తామని వివరించారు.