First Day First Show: సినిమా విడుదలైన వెంటనే మొదటి షో ఇంటి నుండే చూసేయవచ్చు, ఫస్ట్ డే ఫస్ట్ షో కాన్సెప్ట్ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
ఏపీ ఫైబర్ నెట్ ద్వారా అమలు చేస్తున్న ఈ ఫస్ట్ డే ఫస్ట్ షో కార్యక్రమాన్ని నేడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు.
కొత్త సినిమా విడుదలైన రోజే ప్రజలు ఇంటి వద్దే వీక్షించేలా ఏపీ ప్రభుత్వం ఫస్ట్ డే ఫస్ట్ షో కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ఏపీ ఫైబర్ నెట్ ద్వారా అమలు చేస్తున్న ఈ ఫస్ట్ డే ఫస్ట్ షో కార్యక్రమాన్ని నేడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. రిలీజ్ రోజునే ఇంటివద్ద లైవ్ లో సినిమాను చూసేలా రూపొందించిన ఈ కార్యక్రమానికి విశాఖలోని పార్క్ హోటల్ లో శ్రీకారం చుట్టారు. మంత్రి అమర్నాథ్ ఏపీ ఫైబర్ నెట్ ద్వారా తొలి సినిమా 'నిరీక్షణ'ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ, దేశంలో ఇలాంటి కాన్సెప్ట్ ఎక్కడా లేదని అన్నారు. సినిమా విడుదల రోజునే కుటుంబం అంతా కలిసి ఇంటి వద్దే సినిమా చూడొచ్చని తెలిపారు. ఫస్ట్ డే ఫస్ట్ షో కార్యక్రమం ద్వారా గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. చిత్ర పరిశ్రమలో 80 శాతం సినిమాలు విడుదలకు నోచుకోవడంలేదని, అలాంటి సినిమాలకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు.
దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ఫస్ట్ డే ఫస్ట్ షో కార్యక్రమం ప్రారంభించామని ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఛైర్మన్ గౌతం రెడ్డి అన్నారు. సంక్షేమ కార్యక్రమాలతో పాటు వినోదాన్ని సైతం ప్రజల ముంగిటకు తీసుకు వెళ్లాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారని తెలిపారు. ఈ నిర్ణయం గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
చిన్న సినిమాలకు ఉపయోగం: నిర్మాత సి.కల్యాణ్
నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ.. '148 దేశాల్లో ఫస్ట్ డే ఫస్ట్ షో వంటి ప్రయోగమే లేదు. మారుమూల గ్రామాల ప్రేక్షలకు ఎంతో ఉపయోగం. ఫస్ట్ డే ఫస్ట్ షో నిర్ణయం తీసుకున్న సీఎం జగన్‌కు ధన్యవాదాలు. తెలుగు ఇండస్ట్రీకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ నిర్ణయంతో థియేటర్లకు, నిర్మాతలకు ఎలాంటి నష్టం ఉండదు. చిన్న సినిమాలకు ఎంతో ఉపయోగ పడుతుంది. ఫస్ట్ డే ఫస్ట్ షో అనేది మంచి ప్రయోగం. చిన్న సినిమాలు బతుకుతాయి. కొంతమంది సినిమా వాళ్ల విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ కార్యక్రమం ద్వారా సీఎం జగన్‌కు ఎంతో మంచి పేరు వస్తుంది.' అని అన్నారు.
ఫస్ట్ డే ఫస్ట్ షో అంటే ఏంటీ?
చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం కష్టంగా ఉంటోంది. ఈ సమయంలో థియేటర్లకు వెళ్లి సినిమా చూడలేని వారికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కొత్త సినిమాలు చూసేందుకు తీసుకొచ్చిందే ఫస్ట్ డే ఫస్ట్ షో కాన్సెప్ట్. ఏపీ ఫైబర్ నెట్ తీసుకొచ్చిన ఈ కాన్సెప్ట్ ద్వారా కేవలం రూ.99 కే ఫ్యామిలీ అంతా కలిసి రిలీజ్ మూవీస్ చూడొచ్చు. ఈ ప్లాన్‌కు 24 గంటల వ్యాలిడిటీ ఉంటుంది. థియేటర్లకు వెళ్లకుండానే కుటుంబమంతా కలిసి సినిమా చూసే సదవకాశాన్ని ఏపీ ప్రభుత్వం కల్పిస్తోంది.