AP Local Body Polls: ఎస్ఈసీకు ఎదురుదెబ్బ, మంత్రి హౌస్ అరెస్ట్ ఆదేశాలు చెల్లవు, మంత్రి రామచంద్రారెడ్డిపై ఎస్ఈసీ నిమ్మగడ్డ ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసిన ఏపీ హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టేసింది.
Amaravati, Feb 7: ఏపీ ఎన్నికల కమిషన్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టేసింది. మంత్రి పెద్దిరెడ్డి హౌస్ అరెస్ట్‌పై ఆదేశాలు చెల్లవని చెప్పిన హైకోర్టు.. మంత్రికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పెద్దిరెడ్డి దాఖలు చేసిన లంచ్‌మోషన్ పిటిషన్‌పై ఆదివారం విచారణ చేపట్టిన హైకోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది.
పంచాయతీ ఎన్నికల (AP Local Body Polls) నేపథ్యంలో రాష్ట్రంలో పర్యటించాల్సిన బాధ్యత ఆ శాఖ మంత్రిగా పెద్దిరెడ్డికి ఉందన్న పిటిషనర్ తరపు న్యాయవాదుల వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. రాష్ట్ర మంత్రిగా ఆయన ఎక్కడైనా పర్యటించవచ్చని తీర్పులో స్పష్టం చేసింది. మంత్రిపై ఇంట్లోనే ఉండాంటూ ఆయన విధించిన ఆంక్షలను చెల్లవని పేర్కొంటూ ఎస్‌ఈసీ జారీచేసిన ఉత్తర్వులను న్యాయస్థానం కొట్టివేసింది.
కాగా రాష్ట్రంలో నాలుగు దశల పంచాయతీ ఎన్నికలు ముగిసే ఫిబ్రవరి 21వ తేదీ వరకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆయన ఇంటి నుంచి బయటకు రాకుండా నియంత్రించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను ఆదేశిస్తూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. రాజ్యాంగంలోని 243 కె నిబంధన ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తనకు ఉన్న విశేషాధికారాలతో ఈ ఆదేశాలు జారీ చేశానని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
16 రోజుల పాటు మంత్రి పెద్దిరెడ్డిని మీడియాతో కూడా మాట్లాడకుండా నియంత్రించాలని సవాంగ్‌ను కోరారు. దీంతో తనను ఇంటికే పరిమితం చేయాలంటూ రాష్ట్ర డీజీపీకి రాష్ట్ర నిమ్మగడ్డ రమేష్ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల కమిషనర్ ఉత్తర్వుల అమలును నిలిపేయాలని కోర్టును కోరారు. ఈ చర్యలను రాజ్యాంగ విరుద్ధంగా, ఏకపక్ష చర్యగా ప్రకటించాలని అభ్యర్థించారు. హైకోర్టులో సీనియర్ న్యాయవాది సీవీ మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి తరఫున వాదనలు వినిపించారు
ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా ఇంటికి ఎలా పరిమితం చేస్తారని ఎస్ఈసీని పెద్దిరెడ్డి తరఫు న్యాయవాది ప్రశ్నించారు. ఏకగ్రీవాలతో పల్లెలు అభివృద్ధి చెందుతాయన్నది ప్రభుత్వ విధానమని హైకోర్టుకు న్యాయవాది తెలిపారు. మరోవైపు.. పెద్దిరెడ్డి వ్యాఖ్యల క్లిప్పింగులను ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది కోర్టుకు సమర్పించారు.
ఎస్ఈసీకి సహకరిస్తే అధికారులను బ్లాక్ లిస్టులో పెడతామనడం, ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించడమేనని న్యాయవాది చెప్పారు. అయితే ధర్మాపనం ఏపీ ఎస్ఈసీ ఆదేశాలను కొట్టివేసింది. కాగా మంత్రి మీడియాతో మాట్లాడేందుకు వీల్లేదన్న ఎస్ఈసీ ఉత్తర్వులను హైకోర్టు సమర్ధించింది. ఎన్నికల అంశాలకు సంబంధించి ఏ విషయాలనూ మీడియాతో మాట్లాడకూడదని మంత్రిని హైకోర్టు ఆదేశించింది.