Amaravati, Feb 6: ఏపీలో పంచాయితీ ఎన్నికలు వేడెక్కాయి. ఫిబ్రవరి న తొలి దిడత పోలింగ్ (AP Local Body Polls 2021) జరగనుండటంతో అధికార ప్రతిపక్ష పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ కొత్త ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని (minister peddireddy ramachandra reddy) తన నివాసం నుంచి బయటకు రాకుండా కట్టడి చేయాలని సూచిస్తూ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు శనివారం లేఖ రాశారు.
పంచాయతీ ఎన్నికలు ముగిసే తేదీ 21 ఫిబ్రవరి వరకు ఆయన తన నివాసంలోనే పరిమితం అయ్యేలాగా చూడాల్సిందిగా డీజీపీకి (AP DGP) ఆదేశాలు జారీ చేశారు. మంత్రి పెద్దిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్రంతోపాటు చిత్తూరు జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని ఎస్‌ఈసీ (SEC nimmagadda ramesh kumar) లేఖలో పేర్కొన్నారు. ఫిబ్రవరి 21 తేదీ వరకు పెద్దిరెడ్డి తన ఇంటి నుంచి బయటకు రాకుండా నిలువరించాలని డీజీపీకి సూచించారు. అలాగే ఎన్నికలు ముగిసేంతవరకు మంత్రి మీడియాతోనూ మాట్లాడకుండా చూడాలని స్పష్టం చేశారు.
తన ఫిర్యాదుకు మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడిన పత్రిక క్లిప్పింగులను నిమ్మగడ్డ రమేష్ కుమార్ జత చేశారు. మరోవైపు ఎస్‌ఈసీ ఉత్తర్వులపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. మంత్రి పెద్దిరెడ్డిపై నిమ్మగడ్డ ఇచ్చిన అదేశాలుపై మాట్లాడుతూ.. ఎస్‌ఈసీ నుంచి ఇంకా తమకు ఆదేశాలు రాలేదన్నారు. ఆదేశాలు అందిన తరువాత పరిశీలిస్తామని తెలిపారు. తాను రాజకీయాలు మాట్లాడడని, వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకొనని స్పష్టం చేశారు. ఎస్‌ఈసీ ఆదేశాలు వచ్చిన అనంతరం క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారని పేర్కొన్నారు. ఎక్కడా ఇబ్బంది లేకుండా పోలీసు సిబ్బందిని నియమించామని, 13 వేల పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా పెంచామన్నారు. రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా పోలీసులు వెంటనే స్పందిస్తున్నారని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
షాడో, నిఘా టీమ్‌లు ఏర్పాటు చేశాం. చెక్‌పోస్టుల వద్ద మద్యం, డబ్బు తరలింపుపై తనిఖీలు చేస్తున్నాం. ఫ్యాక్షన్ ఉన్న గ్రామాల్లో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేస్తాం.మొదటి విడతలో పోలింగ్ బాక్స్‌ల భద్రతకు 61 స్ట్రాంగ్ రూమ్‌ల ఏర్పాటు చేశాం.1122 రూట్ మొబైల్స్, 199 మొబైల్ చెక్‌పోస్టులు, 9 ఎస్సీ రిజర్వు, 9 అడిషనల్ ఎస్సీ రిజర్వ్ పార్టీలు సిద్ధం చేశాం. ఇప్పటివరకు 9,199 ఆయుధాలు డిపాజిట్ అయ్యాయి. 1,47,931 బైండోవర్,12,779 సెక్యూరిటీ కేసులు నమోదు చేశాం. అనధికారిక, అధికారిక ఆయుధాలు సీజ్ చేస్తాం.కోడ్ అఫ్ కండక్ట్ తప్పినవారిపై ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు ఉంటాయని’’ డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు.
కాగా ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఆదేశాల్ని ఖాతరు చేయాల్సిన అవసరంలేదని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. మంత్రిని ఇంట్లో పెట్టాలనే ఆలోచన దుర్మార్గమన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కోసమే నిమ్మగడ్డ పనిచేస్తున్నారని ఆరోపించారు. తనపై ఆదేశాలు ఇచ్చే ముందు అమలవుతాయో లేదో చూసుకోవాలని, అధికారులు నిర్భయంగా పనిచేయాలని పెద్దిరెడ్డి చెప్పారు.