AP Covid Report: రాజమండ్రిలో కరోనా కల్లోలం, ఒకే కాలేజీలో 163 మందికి కరోనా, రాష్ట్రంలో తాజాగా 310 మందికి పాజిటివ్, చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 51 కేసులు, 7,191కి చేరిన కరోనా మృతుల సంఖ్య
శనివారం ఈ కాలేజీలో 13 కేసులు రాగా, ఆదివారం 10 కేసులు వెలుగుచూశాయి. సోమవారం నాడు ఒక్కరోజే 140 పాజిటివ్ కేసులు రావడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
Amaravati, Mar 23: ఏపీలో గడచిన 24 గంటల్లో 35,375 కరోనా పరీక్షలు నిర్వహించగా 310 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 51 కేసులు (Andhra Pradesh coronavirus cases) వెల్లడి కాగా, తూర్పు గోదావరిలో 43, విశాఖ జిల్లాలో 43 కేసులు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 114 మంది కరోనా నుంచి కోలుకోగా, కృష్ణా జిల్లాలో ఒకరు, కర్నూలు జిల్లాలో మరొకరు మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 8,94,044 పాజిటివ్ కేసులు (coronavirus, cases) నమోదు కాగా 8,84,471 మంది కోలుకున్నారు. ఇంకా 2,382 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 7,191కి పెరిగింది.
రాజమండ్రిలోని ఓ కాలేజీలో ఏకంగా 163 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలింది. శనివారం ఈ కాలేజీలో 13 కేసులు రాగా, ఆదివారం 10 కేసులు వెలుగుచూశాయి. సోమవారం నాడు ఒక్కరోజే 140 పాజిటివ్ కేసులు రావడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీనిపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ గౌరీనాగేశ్వరరావు స్పందిస్తూ... 700 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు జరిపామని వెల్లడించారు. పాజిటివ్ విద్యార్థులను ఒకే ప్రదేశంలో ఉంచి, ఆ ప్రదేశాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించామని వివరించారు. కరోనా సోకని విద్యార్థులను మరో హాస్టల్ లో ఉంచినట్టు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఒంటిపూట బడులు (Half Day Schools in AP) ఉంటాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఏప్రిల్ 1 నుంచి ఇది అమలవుతుందని ఆయన (State Education Minister Adimulku Suresh) చెప్పారు. ఉదయం 7.45 నుంచి 12.30 వరకు తరగతుల అనంతరం మధ్యాహ్న భోజనం యథావిధిగా ఉంటుందని పేర్కొన్నారు.