Amaravati, Mar 22: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఒంటిపూట బడులు (Half Day Schools in AP) ఉంటాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఏప్రిల్ 1 నుంచి ఇది అమలవుతుందని ఆయన (State Education Minister Adimulku Suresh) చెప్పారు. ఉదయం 7.45 నుంచి 12.30 వరకు తరగతుల అనంతరం మధ్యాహ్న భోజనం యథావిధిగా ఉంటుందని పేర్కొన్నారు.
కరోనా కేసులు, ఎండల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పాఠశాల నుంచి విద్యార్థులు క్షేమంగా ఇళ్లకు చేర్చటంపై ఉపాధ్యాయులు శ్రద్ద తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు నిర్వహణ, మాస్క్లు ధరించడం, శానిటైజర్ వినియోగం, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని మంతత్రి ఆదేశాలు జారీ చేశారు.
ఏపీలో మరోసారి 300కి పైగా కొత్త కేసులు వెల్లడయ్యాయి. గడచిన 24 గంటల్లో 31,138 కరోనా పరీక్షలు నిర్వహించగా 368 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఒక్క గుంటూరు జిల్లాలోనే అత్యధికంగా 79 కొత్త కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో 49, అనంతపురం జిల్లాలో 40, చిత్తూరు జిల్లాలో 40 కేసులు గుర్తించారు. అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 6 కేసులు నమోదయ్యాయి.
అదే సమయంలో 263 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఎలాంటి మరణాలు సంభవించలేదు. ఇప్పటివరకు ఏపీలో 8,93,734 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,84,357 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 2,188 మందికి చికిత్స అందిస్తున్నారు. మొత్తం మరణాల సంఖ్య 7,189గా నమోదైంది.