Araku Valley Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం, 80 అడుగుల లోతులో పడిపోయిన బస్సు, నలుగురు మృతి, 23 మందికి గాయాలు, విశాఖ అరకులో విషాద ఘటన, తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, తెలుగు రాష్ట్రాల సీఎంలు, ఇతరులు
Visakhapatnam, Feb 13: విశాఖపట్నం అరకులోయలో ఘోర ప్రమాదం జరిగింది. ఘాట్‌రోడ్ ఐదో నంబరు మలుపు వద్ద టూరిస్ట్ బస్సు లోయలోకి దూసుకెళ్లడంతో చిన్నారితో సహా నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. వీరిని హైదరాబాద్‌కు చెందిన పర్యాటకులుగా గుర్తించారు. 23 మంది టూరిస్టులకు గాయాలు (Araku Valley Bus Accident) కాగా వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతులంతా హైదరాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు.
ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఎస్.కోట ఆస్పత్రికి తరలించారు. డుముకు దాటిన తర్వాత మలుపు వద్ద బస్సు లోయలో పడినట్లు సమాచారం. ప్రమాద సమయంలో (Araku ghat road accident) బస్సులో 38 మంది పర్యాటకులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి (Visakhapatnam bus accident) గురైన బస్సు హైదరాబాద్ షేక్‌పేటకు చెందిన దినేష్ ట్రావెల్స్‌దిగా గుర్తించారు.ః
మృతులు, క్షతగాత్రులంతా నాలుగు కుటుంబాలకు చెందిన వారిగా గుర్తించారు. హైదరాబాద్ లోని షేక్ పేటకు చెందిన కె సత్యానారాయణ రిజర్వబ్యాంకులో పనిచేసి ఇటీవల పదవీ విరమణ పొందారు. కుటుంబీకులతో కలిసి తీర్థయాత్రల కోసం ఈ నెల 10న దినేష్ ట్రావెల్స్ మినీ బస్సులో హైదరాబాద్ నుంచి బయలుదేరారు. విజయవాడ ఇంద్ర కీలాద్రి, అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయాలను దర్శించుకున్నారు. గురువారం రాత్రి సింహాచలం దగ్గర బస చేశారు. అనంతరం శుక్రవారం ఉదయం అరకు వెళ్లి పర్యాటక ప్రాంతాల్లో సరదాగా గడిపారు. బొర్రా గుహలను సందర్శించి తిరుగు ప్రయాణంలో బస్సు లోయలో పడింది. రాత్రి ఏడింటికి బొర్రాకు, టైడాకు మధ్యన మలుపు వద్ద బస్సు లోయలో పడింది. సుమారు 80 అడుగుల లోతులో బస్సు పడిపోయింది.
PMO India Tweet
Here's AP CMO Tweet
ఈ ప్రమాదంలో చిన్నారి నిత్య, కొట్టం సత్యానారాయణ, కె సరిత, ఎస్ లత, అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను ఎస్. కోట ఆస్పత్రికి తరలించి ప్రాధమిక చికిత్స అనంతరం విశాఖ కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద వివరాల కోసం విశాఖ కలెక్టరేట్ లో 0891 2590102, 0891 2590100 నంబర్లను ఏర్పాటు చేశారు. కాగా కిందికి వస్తుండగా బ్రేక్ ఫెయిలయ్యింది. ఘాట్ రోడ్డు డౌన్ కావడంతో.. డ్రైవర్ బస్సును కంట్రోల్ చేయలేకపోయాడు. కుడివైపునకు బస్సుని తిప్పి ఉంటే.. కొండని ఢీకొట్టి.. బస్సు రోడ్డుపై నిలిచిపోయేది. కానీ.. బస్సును అదుపు చేయలేక, డ్రైవర్ ఎడమవైపు తిప్పడంతో.. ఒక్కసారిగా లోయలోకి దూసుకుపోయింది. డ్రైవర్ కాస్త అప్రమత్తంగా ఉండుంటే ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయట పడేవారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
Here's Accident Photos
బస్సు ప్రమాదం జరిగిన వెంటనే సమీప డముకు ప్రాంతానికి చెందిన పాతిక మంది గిరిజనులు ఘాట్ రోడ్డుకు చేరుకున్నారు. పక్కనే ఉన్న బొర్రా మోటర్ యూనిట్ సభ్యులు 20 మంది వచ్చారు. లోయలోకి బస్సు పడిపోయిందని తెలుసుకుని వెంటనే సహాయక చర్యలకు ఉపక్రమించారు. అంతలోనే హుటాహుటిన అరకు సీఐ పైడయ్య, అనంతగిరి ఎస్‌ఐ సుధాకర్ బృందం చేరుకుంది. గిరిజనులు, మోటార్ యూనిట్ సభ్యులు, పర్యాటకులు కొందరు పోలీసులతో కలిసి లోయలోకి దిగారు. సుమారు 80 అడుగుల లోయ.. దట్టమైన పొదలు, చెట్లు.. బస్సు ఎంత లోపలికి వెళ్లిందో కనిపెట్టేందుకే దాదాపు అరగంట సమయం పట్టింది. క్షతగాత్రుల ఆర్తనాదాలు వింటూ.. ముందుకు అడుగేశారు. మొబైల్స్‌లోని ఫ్లాష్ లైట్స్ వెలుతురుతో బస్సు వద్దకు చేరుకున్నారు.
లోయ అడుగున ఉన్న బస్సులోకి వెళ్లి చూసే క్షతగాత్రులు చెల్లాచెదురుగా పడి ఉన్నారు. ముగ్గురు విగతజీవులుగా మారారు. మరో 8 నెలల పసికందు కూడా మృతి చెంది ఉంది. పిల్లలు గుక్కపట్టి ఏడుస్తున్నారు. కాపాడండంటూ మహిళలు ఆర్తనాదాలు చేస్తున్నారు. అక్కడి దృశ్యాలు సహాయక చర్యలకు వెళ్లిన అందర్నీ కంటతడి పెట్టించాయి. పై నుంచి కార్లు, వ్యాన్ల లైట్లు ఫోకస్ చేశారు. పర్యాటకులు మొబైల్‌లోని ఫ్లాష్‌లైట్స్ ఆన్ చేసి ఉంచగా.. క్షతగాత్రులు ఒక్కొక్కర్నీ నలుగురైదుగురు గిరిజనులు కలిసి మోసుకుంటూ పైకి తీసుకొచ్చారు. ఒక 108 వాహనం రాగా.. అందులో కొందర్ని ఎక్కించి ఎస్.కోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరికొందరు తమ ప్రైవేటు వాహనాల్ని సిద్ధం చేశారు. పైకి మోసుకొచ్చిన క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. యుద్ధ ప్రాతిపదికన పోలీసులు సహాయక చర్యలు వేగవంతంతో చాలా మందిని కాపాడారు.
అరకు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన పలువురు ప్రయాణికులు మృతి చెందడం పట్ల ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద విషయం తెలిసి ఎంతో బాధపడ్డానని ప్రధాని మోదీ ట్విటర్ ద్వారా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
కాగా, ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ఏపీ గవర్నర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని కోరారు. ప్రమాదం గురించి తెలియగానే సీఎస్ సోమేశ్‌కుమార్‌తో మాట్లాడారు. కాగా, బస్సు ప్రమాదంపై సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రమాద సంఘటనపై సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, డీఐజీ కాళిదాసు, ఎస్పీ కృష్ణతో తెలంగాణ సీఎస్ సోమేశ్‌కుమార్ మాట్లాడి క్షతగాత్రులకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. హైదరాబాద్‌లోని ప్రయాణికుల ఇళ్లకు అధికారులను పంపాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌ను సీఎస్ ఆదేశించారు.
అరకు బస్సు ప్రమాదంపై ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్, ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అధికారులను అడిగి ఘటన వివరాలు తెలుసుకున్నారు. ఈ దుర్ఘటనలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు.
అరకు బస్సు ప్రమాద ఘటనపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. మృతులకు తన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులకు తక్షణ సహాయక చర్యలు అందించాలని ఏపీ అధికారులను ఆయన కోరారు.
అరకు బస్సు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన పలువురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడంపై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు అన్నివిధాలా సాయం అందించాల్సిందిగా ఏపీ అధికారులను కోరినట్లు తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు. కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు. మంత్రులు హరీశ్‌రావు, మహమూద్ అలీ కూడా అరకు ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.