AP Local Body Polls: కుప్పంలో అక్రమ కేసులు ఆపండి, ఎస్ఈసీకి లేఖ రాసిన చంద్రబాబు, మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడకూడదని ఈసీ నిమ్మగడ్డ ఆదేశాలు, రాష్ట్రంలో మొదలైన రెండో దశ పోలింగ్
Andhra Pradesh local Body Elections 2020 | (Photo-PTI)

Amaravati, Feb 13: ఏపీలో పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్‌ (Second Phase Gram Panchayat elections Polling)శనివారం ఉదయం ప్రారంభమైంది. ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది. రెండో దశలో 13 జిల్లాల్లో, 18 రెవెన్యూ డివిజన్లలోని 167 మండలాల్లో 3,328 పంచాయతీ సర్పంచ్‌ స్థానాలు, 33,570 వార్డు సభ్యులకు గాను నోటిఫికేషన్‌ జారీచేయగా... 539 సర్పంచ్‌లు, 12604 వార్డు సభ్యుల స్థానాల్లో ఏకగ్రీవాలు అయ్యాయి. నెల్లూరు, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కో సర్పంచ్‌ స్థానం చొప్పున మొత్తం మూడు చోట్ల సర్పంచ్‌ స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు.

అలాగే 149 చోట్ల వార్డు సభ్యులకు ఒక్క నామినేషన్‌ కూడా వేయలేదు. దీంతో ఏకగ్రీవాలు పోను 2,786 సర్పంచ్‌లకు, 20,817 వార్డు సభ్యులకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్‌ స్థానాలకు 7,507 మంది అభ్యర్థులు, వార్డు స్థానాలకు 44,876 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మరో 149 వార్డులలో నామినేషన్లు దాఖలు చేయలేదు. 29,304 పోలింగ్‌ కేంద్రాలను ఎస్‌ఈసీ ఏర్పాటు చేసింది.అందులో 5,480 కేంద్రాలను సమస్యాత్మకంగా, 4,181 కేంద్రాలను అత్యంత సమస్యాత్మకంగా గుర్తించింది. 18,387 పెద్ద, 8,351 మధ్యరకం, 24,034 చిన్న బ్యాలెట్‌ బాక్సులను సిద్ధంచేసింది. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు.

రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల (AP Local Body Elections) పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరారు. ఉదయం 5:30 గంటలకే పోలింగ్ బూత్‌లను ఎన్నికల అధికారులు సిద్ధం చేశారు. పోలింగ్ కేంద్రాల దగ్గర 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ విధించారు. దుకాణాలు మూసివేశారు.

తొలి రెండు గంటల్లో పోలింగ్ 10.28 శాతం నమోదైంది. క్యూలైన్లలో ఓటర్లు ఓటు వేయడానికి వేచి ఉన్నారు. 9 వేలకుపైగా సమస్యాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల అధికారి గిరిజా శంకర్‌ పర్యవేక్షిస్తున్న్నారు.

చిత్తూరు జిల్లాలోని కొర్లకుంటలో టీడీపీ సర్పంచ్ అభ్యర్థి పేరం మేనక భర్త ప్రభాకర్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ సర్పంచ్ అభ్యర్థి మద్దిరాల భాను ప్రకాష్‌రెడ్డిని పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి గాలివీడు పోలీస్ స్టేషన్‌కి తరలించారు. లక్కిరెడ్డిపల్లె మండలంలో పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది.

పామర్రు పెరిసేపల్లి పోలింగ్ కేంద్రంలో వైఎస్సార్‌సీసీ మద్దతు ఏజెంట్‌పై టీడీపీ మద్దతుదారులు దాడికి తెగపడ్డారు. సదరు ఏజెంట్‌ మాస్క్‌ పెట్టుకోలేదనే నెపంతో దాడి చేశారు. టీడీపీ మద్దతుదారులపై ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో టీడీపీ మద్దతుదారులపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఏస్పీ ఆదేశించారు.

ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి (SEC) టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఓ లేఖ రాశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో త‌మ పార్టీ నేత‌ల‌పై అక్ర‌మ కేసులు పెడుతున్నార‌ని, మిట్టపల్లి గ్రామ పంచాయతీ వైసీపీ అక్రమాలకు పాల్ప‌డుతోంద‌ని ఆయన (Chandra Babu) ఆరోపించారు. త‌మ పార్టీ అభ్యర్థి శివలక్ష్మి భర్త మంజునాథపై అక్రమ కేసు నమోదు చేశారని వివ‌రించారు. మ‌రో టీడీపీ నాయకుడు మనోహర్ పై కూడా ప‌లు సెక్ష‌న్ల కింద కేసులు పెట్టార‌ని చెప్పారు. కేసులు పెట్ట‌డంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నార‌ని వివ‌రించారు.

త‌మ పార్టీ నేత‌ల‌పై పెట్టిన కేసులను వెంటనే ఉప సంహ‌రించేలా చేయాల‌ని చెప్పారు. అలాగే, మనోహర్‌కు ఎన్నికల సంఘం రక్షణ కల్పించాలని కోరారు. కుప్పంలో కూడా వైసీపీ నేత‌లు గందర‌గోళం నెల‌కొల్పుతున్నార‌ని చెప్పారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఎన్నికల సంఘం ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేసిన ఏపీ పౌరసరఫరాల మంత్రి కొడాలి నానికి ఎన్నికల సంఘం మీడియాతో మాట్లాడొద్దని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో తుది విడత ఎన్నికల పోలింగ్ ముగిసే ఈ నెల 21వ తేదీ వరకు మీడియా సమావేశాల్లో కానీ, బృందాలతో కానీ మాట్లాడొద్దని ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఈ ఆదేశాలను అమలు చేయాల్సిందిగా కృష్ణా జిల్లా కలెక్టర్, ఎస్పీ, విజయవాడ పోలీస్ కమిషనర్ లకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

ఎస్‌ఈసీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, ఎన్నికల సంఘం ప్రతిష్ఠకు ఇవి భంగం కలిగించేలా ఉన్నాయని పేర్కొన్న ఈసీ తక్షణం వివరణ ఇవ్వాలంటూ మంత్రికి నిన్న షోకాజ్ నోటీసు జారీ చేశారు. దీనికి స్పందించిన మంత్రి తన లాయర్ ద్వారా వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలు ఉద్దేశపూరితం కాదని, ప్రతిపక్ష పార్టీ అరాచకాలను బయటపెట్టే ఉద్దేశంతోనే మీడియా సమావేశం నిర్వహించానని తెలిపారు. రాజ్యాంగబద్ధ సంస్థలపై తనకు గౌరవం ఉందని, ఎన్నికల కమిషనర్‌ను గౌరవిస్తానని పేర్కొన్నారు. షోకాజ్ నోటీసు ఉపసంహరించుకోవాలని కోరారు. అయితే, నాని వివరణతో సంతృప్తి చెందని ఎస్ఈసీ గత రాత్రి ఏడు పేజీల ఉత్తర్వులు జారీ చేశారు.

మంత్రి వివరణపై రమేశ్ కుమార్ మాట్లాడుతూ.. ఆయన తన వ్యాఖ్యలను తోసిపుచ్చలేదని, వాటిని ఏ ఉద్దేశంతో అన్నానో గుర్తించాలని సలహా ఇచ్చారని అన్నారు. ఆయన వివరణలో ఎక్కడా పశ్చాత్తాపం అన్నది కనిపించలేదన్నారు. ఎన్నికల సంఘంపైనా, కమిషనర్‌పైనా ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న దాడిలో భాగమే ఇదని పేర్కొన్నారు. మంత్రి కావాలనే ఆ వ్యాఖ్యలు చేశారని అన్నారు. ఎస్‌ఈసీని ప్రతిపక్ష నాయకుడు, మీడియా సంస్థల అధిపతులతో కలిపి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, వారిని కుట్రదారులుగా అభివర్ణించారని పేర్కొన్నారు.

మంత్రి ఆరోపణలు చేసిన వారిలో ఒకరు ‘పద్మవిభూషణ్’ సహా అనేక గౌరవాలు పొందారని, జాతి గౌరవానికి ప్రతీకలైన అలాంటి వారికి సముచిత గౌరవం ఇవ్వాల్సి ఉందని అన్నారు. తాను సీఎం పతనాన్ని కోరుకుంటున్నట్టుగా మంత్రి వ్యాఖ్యానించారని ఆవేదన వ్యక్తం చేశారు.

తాను సీఎంకు, ఆయన కార్యాలయానికి ఎంతో గౌరవం ఇస్తానన్నారు. మంత్రి గత నాలుగైదు నెలలుగా ఎన్నికల సంఘంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని, అయినప్పటికీ స్పందించలేదని వివరించారు. అయితే, ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న సమయంలోనూ ఇలాంటి వ్యాఖ్యలే చేయడం వల్ల ఎన్నికల సంఘంపై ప్రజలు విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉందని, అందుకనే మంత్రిపై చర్యలు తీసుకున్నట్టు నిమ్మగడ్డ పేర్కొన్నారు.