CM YS Jagan VC Highlights: ఏపీ ప్రజలకు కొత్త ఏడాది నాడు ప్రభుత్వం వరాల జల్లులు, పెన్సన్ రూ. 2500 కు పెంపు, రైతుభరోసా మూడో విడత నిధులు, ఈబీసీ నేస్తం చెల్లింపులు జనవరిలో విడుదల
ప్రస్తుతం ప్రతినెలా మొదటి రోజే రూ.2,250 చొప్పున ఇస్తున్న వైఎస్సార్ పెన్షన్ కానుకను జనవరి 1వతేదీన రూ.2,500కు పెంచి అవ్వా తాతల చేతిలో పెడతామని తెలిపారు.
Amaravati, Dec 15: రాష్ట్రంలో లక్షల మంది అవ్వాతాతల మోముల్లో చిరునవ్వులు విరబూసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొత్త ఏడాది కానుక ప్రకటించారు. ప్రస్తుతం ప్రతినెలా మొదటి రోజే రూ.2,250 చొప్పున ఇస్తున్న వైఎస్సార్ పెన్షన్ కానుకను జనవరి 1వతేదీన రూ.2,500కు పెంచి అవ్వా తాతల చేతిలో పెడతామని తెలిపారు.స్పందన’లో భాగంగా కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులతో మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో (CM YS VC Highlights) సీఎం జగన్ ఈ విషయాన్ని వెల్లడించారు.
ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ కానుకను పెంచుతున్నామని, ఇది చాలా పెద్ద కార్యక్రమం అని తెలిపారు. ఈ సందర్భంగా డిసెంబర్, జనవరిలో అమలు చేసే పలు పథకాలు, కార్యక్రమాల వివరాలను సీఎం ప్రకటించారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన, స్పందన సమస్యల పరిష్కారంపై ఉన్నతాధికారులకు మార్గనిర్దేశం చేశారు. రైతుభరోసా మూడోవిడత నిధులు (YSR Rythu Bharosa) జనవరిలోనే చెల్లిస్తాం. ఈబీసీ నేస్తం కింద జనవరి 9న చెల్లింపులు ఉంటాయి. అగ్రవర్ణ నిరుపేద మహిళలకు ఏడాదికి రూ.15వేల చొప్పున మూడేళ్లు ఇస్తాం. ఈ ఏడాది వివిధ పథకాల కింద మిగిలిపోయిన లబ్ధిదారులకు డిసెంబరు 28న ప్రయోజనాలు పంపిణీ చేస్తాం' అని సీఎం జగన్ వెల్లడించారు.
ఒకే అర్జీ రెండోసారి వస్తే దాన్ని మరింత లోతుగా పరిశీలించాలి.తొలిసారి చూసినవారి కంటే పై అధికారి దాన్ని పరిశీలించాలి. అర్జీల పరిష్కారంలో నాణ్యత ముఖ్యం' అన్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు- ఓటీఎస్ పథకంలో రూ.10వేల కోట్ల భారీ బకాయిని ప్రభుత్వం మాఫీచేస్తోంది. ఆస్తిపై పూర్తిహక్కులు కల్పిస్తోంది. రూ.5-10 లక్షల ధర ఉన్నవాటినీ ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. ప్రజలకు దీనిద్వారా రూ.6,000 కోట్ల లబ్ధి కల్పిస్తున్నాం. గత ప్రభుత్వాలు వడ్డీ కూడా మాఫీ చేయకపోయినా ఆ నాయకులు దీన్ని విమర్శిస్తున్నారని జగన్ అన్నారు.
ఏ ఒక్కరినీ విడిచిపెట్టకుండా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో, పారదర్శక పద్ధతిలో ప్రయోజనాలను అందించడం ఎస్‌డీజీ లక్ష్యాల వెనుక ప్రధాన ఉద్దేశం. నవరత్నాల ద్వారా అందరినీ మ్యాపింగ్ చేశాం. ఆశించిన లక్ష్యాలను సాధించాలి. దేశంతో పోలిస్తే మన లక్ష్యాలు మెరుగ్గా ఉండాలి. ఎస్‌డీజీ లక్ష్యాల సాధనపై కలెక్టర్లు దృష్టిపెట్టి పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి జిల్లా ఎస్‌డీజీ లక్ష్యాల సాధనలో ముందుకు సాగాలి. సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్‌ల భవన నిర్మాణాలన్నీ ఉగాది నాటికి పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలి. డిజిటల్ లైబ్రరీలు కూడా త్వరలో అందుబాటులోకి రావాలి. నాడు –నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు పునరుజ్జీవం పొందాయి. మరోవైపు విలేజ్ క్లినిక్‌లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తున్నాయి. వీటన్నింటి ద్వారా మొత్తం గ్రామాల ముఖచిత్రం మారిపోతోందని సీఎం తెలిపారు.
కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌కు విస్తృతంగా వ్యాప్తి చెందే లక్షణం ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉంటూ కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారిని ట్రాక్ చేయడం, ట్రేస్ చేయడం చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. దీనిపై అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ విషయంలో ఏమాత్రం అలసత్వం వహించినా మరోదఫా మహమ్మారికి అవకాశం ఇచ్చినట్లవుతుందని హెచ్చరించారు. అలాంటి పరిస్థితి రాకుండా అందరూ జాగ్రత్తలు పాటించాలని కోరారు.
కోవిడ్ నియంత్రణపై అధికార యంత్రాంగం అద్భుతంగా పని చేస్తోంది. 32 దఫాలు ఇంటింటి సర్వే చేసి డేటా సేకరించారు. కోవిడ్ అనుమానితులకు పరీక్షలు చేస్తున్నారు. దేశంలో కోవిడ్ రికవరీ రేటు 98.36 శాతం కాగా రాష్ట్రంలో 99.21 శాతం ఉంది. మరణాల రేటు దేశంలో 1.37 శాతం అయితే మన దగ్గర 0.7 శాతం మాత్రమే ఉంది. రాష్ట్రంలో అందరికీ వ్యాక్సినేషన్ పూర్తయ్యేవరకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లాలి. ఈ నెలాఖరులోగా నూటికి నూరు శాతం సింగిల్ డోసు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి.
డబుల్ డోస్ వ్యాక్సినేషన్ కూడా వీలైనంత త్వరగా పూర్తవ్వాలి. డోసుల మధ్య విరామాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందా? ఉంటే.. ఎలా చేయాలి? అనే అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని అధికారులను ఆదేశించాం. వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ పూర్తి చేయడమే దీని ఉద్దేశం. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో మొదటి డోసు వంద శాతం పూర్తయింది. కలెక్టర్, సిబ్బంది అందరికీ అభినందనలు. వ్యాక్సినేషన్‌లో వెనకబడ్డ జిల్లాలపై ధ్యాస పెట్టాలి. శ్రీకాకుళం, తూర్పు గోదావరి, చిత్తూరు, విశాఖ కలెక్టర్లు వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించాలి.
104 కాల్ సెంటర్‌పై మరోసారి అధికారులు సమీక్ష చేయాలి. కాల్ చేయగానే వెంటనే స్పందన ఉండాలి. కోవిడ్ నివారణ చర్యలు, చికిత్సకు 104 వన్ స్టాప్ సొల్యూషన్. నిర్దేశించుకున్న సమయంలోగా కాల్ చేసిన వారికి సహాయం అందాలి. కాల్ చేస్తే స్పందన లేదనే మాట ఎక్కడా వినిపించకూడదని సీఎం తెలిపారు.