Amaravati, Dec 14: కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో మూడు కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు (New Medical Colleges in AP) ఆమోదం తెలిపినట్లు ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి పవార్ (Health Minister Dr Bharati Pawar) తెలిపారు. రాజ్యసభలో మంగళవారం వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే 13 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయని చెప్పారు.
ప్రధానమంత్రి స్వస్థ్య సురక్ష యోజన కింద తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, విజయవాడలోని సిద్ధార్ధ మెడికల్ కాలేజీ, అనంతపురంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అభివృద్ధికి కూడా ఆమోదం తెలిపినట్లు మంత్రి చెప్పారు. ఇవి కాకుండా పిడుగురాళ్ళ, పాడేరు, మచిలీపట్నంలో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు.
దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఏడు మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్, అప్పరెల్ పార్కు (మిత్రా)లలో ఒక దాన్ని ఏపీలోని వైఎస్‌ఆర్ కడప జిల్లా కొప్పర్తిలో ఏర్పాటు చేయాలని రాజ్యసభలో కేంద్రానికి ఎంపీ విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలకు చెల్లించాల్సిన 51,798 కోట్లను కేంద్రం తక్షణం చెల్లించాలి. కరోనా కారణంగా రాష్ట్రాల ఆదాయాలు తగ్గి అభివృద్ధి, సంక్షేమ పథకాల కొనసాగింపునకు నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. జీఎస్టీ వసూళ్లు పెరుగుతున్నందున బకాయిల విడుదలపై దృష్టి పెట్టాలని కోరారు.
ఇక విశాఖపట్నం పోర్టులో మొత్తం సిబ్బంది సంఖ్య 4,003 ఉండగా 1,112 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పోర్టుల శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ వెల్లడించారు. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ విశాఖపట్నం పోర్టుతోపాటు దేశంలోని మేజర్ పోర్టులలో అనేక ఏళ్ళుగా టెక్నాలజీ, మెకనైజేషన్ కారణంగా చోటు చేసుకున్న మార్పుల కారణంగా ప్రైవేట్ పోర్టులతో పోల్చుకుంటే మేజర్ పోర్టులలో సిబ్బంది సంఖ్య అవసరమైన దానికంటే చాలా ఎక్కువగా ఉన్నట్లు మంత్రి చెప్పారు. అందువలన మేజర్ పోర్టులలో సిబ్బందిని అవసరం మేరకు మాత్రమే ఉంచాలని నిర్ణయించినట్లు తెలిపారు.