AP Coronavirus: ఏపీలో తాజాగా 1,316 మందికి కరోనా, ఇప్పటివరకు 94,08,868 పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం, 11 మంది మృతితో 6,910కి చేరిన మరణాల సంఖ్య, డిసెంబర్ 10 నాటికి ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో హెల్ప్ డెస్క్‌లు
గడిచిన 24 గంటల్లో 75,165 మందికి కరోనా పరీక్షలు చేయగా 1,316 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,58,711కు (AP Coronavirus) చేరింది.
Amaravati, Nov 20: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఇప్పటివరకు 94,08,868 పరీక్షలు జరిగాయి. గడిచిన 24 గంటల్లో 75,165 మందికి కరోనా పరీక్షలు చేయగా 1,316 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,58,711కు (AP Coronavirus) చేరింది. నిన్న ఒక్క రోజే కరోనా ( COVID-19) నుంచి కోలుకుని 1,821 మంది డిశ్చార్జ్ అవ్వగా.. మొత్తం 8,35,801 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 16,000. వైరస్ బాధితుల్లో కొత్తగా 11 మంది మృతి చెందడంతో.. మొత్తం మృతుల సంఖ్య 6,910కి (Covid Deaths) చేరింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ గురువారం కరోనాపై హెల్త్ బులెటిన్ (Coronavirus update) విడుదల చేసింది.
వచ్చే నెల 10వ తేదీ నాటికి ఆరోగ్య శ్రీ ఆస్పత్రులన్నింటిలో హెల్ప్ డెస్క్‌ల ఏర్పాటు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్య శ్రీ ఆస్పత్రుల్లో తప్పనిసరిగా హెల్ప్ డెస్క్‌లు, సీసీ కెమెరాలు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. స్పందన కార్యక్రమంలో భాగంగా ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వివిధ అంశాలపై కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరోగ్య మిత్రలు ఏం చేయాలన్న దానిపై ఒక నిర్దిష్ట ఎస్‌వోపీ ఖరారు చేయాలని సూచించారు. ఆరోగ్య ఆసరా ఎలా అమలవుతోందన్నది జేసీలు చూడాలన్నారు. అస్పత్రులలో 9,800 పోస్టులు మంజూరు చేశామని, వాటిలో జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో 7,700 పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా, ఇప్పటికే 5,797 పోస్టులు భర్తీ అయ్యాయన్నారు.
మిగిలిన పోస్టులు కూడా త్వరగా భర్తీ చేసేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జగనన్న తోడు పథకం నవంబర్ 25న ప్రారంభం అవుతోందని, ఈ పథకంలో ఇప్పటి వరకు 6.29 లక్షల దరఖాస్తులకు బ్యాంకులు టైఅప్ అయ్యాయని చెప్పారు. మిగిలిన దరఖాస్తులను కూడా వెంటనే బ్యాంకులకు పంపాలన్నారు.