COVID-19 Vaccine Dry Run: కృష్ణా జిల్లాలో కరోనావైరస్ వ్యాక్సిన్ డ్రై రన్, జిల్లాలోని ఐదు సెంటర్‌లలో కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ కార్యక్రమం ప్రారంభించిన కలెక్టర్ ఇంతియాజ్, 125 మందితో డ్రై రన్
ప్రకాశ్ నగర్ అర్బన్ హెల్త్ కేర్ సెంటర్‌లో డమ్మీ వ్యాక్సినేషన్ డ్రై రన్‌ను (COVID-19 Vaccine Dry Run) జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ప్రారంభించారు
Amaravati, December 28: ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లాలో (Andhra Pradesh’s Krishna District) కరోనావైరస్ వ్యాక్సిన్ డ్రై రన్ ప్రారంభమైంది. ప్రకాశ్ నగర్ అర్బన్ హెల్త్ కేర్ సెంటర్‌లో డమ్మీ వ్యాక్సినేషన్ డ్రై రన్‌ను (COVID-19 Vaccine Dry Run) జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ‘జిల్లాలోని ఐదు సెంటర్‌లలో కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ కార్యక్రమం ప్రారంభం అయ్యింది. వెయిటింగ్ రూం, వ్యాక్సినేషన్ రూంతో పాటు వ్యాక్సిన్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. రేపు రియల్ టైం లో వ్యాక్సిన్‌ను అందించేందుకు ఈ ఏర్పాట్లు ఉపయోగపడతాయి. 125 మందితో డ్రై రన్‌ను నిర్వహిస్తున్నాం. డిస్టిక్ టాస్క్ ఫొర్స్‌కి సాయంత్రం పంపిస్తామని ఇంతియాజ్ ( Krishna district collector Imtiaz) తెలిపారు.
విజయవాడ జీజీహెచ్, ఉప్పులూరు పీహెచ్‌సీ, ప్రకాష్ నగర్ ఆస్పత్రి, పూర్ణ హార్ట్ ఆస్పత్రి, కృష్ణవేణి కళాశాలలో డ్రై రన్ నిర్వహిస్తున్నారు. ఒక్కొక్క సెంటర్‌కు అయిదుగురు వ్యాక్సినేషన్ అధికారులను నియమించారు. టీకా డ్రై రన్‌కు ప్రతి కేంద్రంలో అయిదుగురు సిబ్బంది ఉంటారు. ఇక మూడు గదులు ఏర్పాటు చేశారు. మొదటి గదిలో రిజిస్ట్రేషన్, రెండో గదిలో వ్యాక్సినేషన్, మూడో గదిలో పరిశీలన ఉంటుంది. ప్రతి సెంటర్‌లో ఎంపిక చేసిన 25మందికి డ్రై రన్ చేపట్టారు. కాగా లోపాలు గుర్తించి అధిగమించడమే డ్రై రన్ ప్రధాన లక్ష్యం.
నామమాత్ర పు(డమ్మీ) కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను డ్రై రన్‌గా వ్యవహరిస్తారు. ఇదొక మాక్ డ్రిల్ లాంటిదని చెప్పవచ్చు. టీకా పంపిణీకి అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేయడం, లోపాలను గుర్తించే ప్రయత్నంలో భాగంగానే ఈ డ్రై రన్ నిర్వహిస్తున్నారు. ఇందులో కొంతమందికి డమ్మీ వ్యాక్సిన్ ఇస్తారు. వారి వివరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు.