AP Coronavirus: ఏపీలో ఈ పాస్‌కు దరఖాస్తు చేసుకోవడానికి మార్గాలు, నేటి నుంచి అమల్లోకి ఈ పాస్ విధానం, రాష్ట్రంలో తాజాగా 14,986 మందికి పాజిటివ్, 84 మంది మృత్యువాత
అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 2,352 కొత్త కేసులు నమోదు కాగా, పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యల్పంగా 423 కేసులు గుర్తించారు.
Amaravati, May 11: రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 60,124 కరోనా పరీక్షలు నిర్వహించగా 14,986 మందికి పాజిటివ్ (AP Coronavirus) అని తేలింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 2,352 కొత్త కేసులు నమోదు కాగా, పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యల్పంగా 423 కేసులు గుర్తించారు.
అదే సమయంలో 16,167 మంది కరోనా నుంచి కోలుకోగా, 84 మంది మృత్యువాత (Covid Deaths) పడ్డారు. పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో 12 మంది చొప్పున మృతి చెందారు. ఏపీలో ఇప్పటివరకు 13,02,589 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 11,04,431 మంది కోలుకున్నారు. ఇంకా 1,89,367 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 8,791కి పెరిగింది.
ఏపీలో కర్ఫ్యూ అమలులో ఉన్న సమయాల్లో అత్యవసరంగా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు సడలింపు ఇవ్వడానికి ప్రభుత్వం ‘ఈ’ పాస్ విధానం అమల్లోకి వచ్చింది. సోమవారం నుంచి దీనికి సంబంధించిన దరఖాస్తును పోలీసు శాఖ ఆన్‌లైన్‌లో ఉంచింది. రాష్ట్రం నుంచి దూర ప్రాంతాలకు, దూరప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి, రాష్ట్రంలోని ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లాలనుకున్న వారికి అత్యవసరం కారణాలను బట్టి ఈ పాస్‌లు జారీ చేస్తారు.
పాస్‌లు అవసరమైన వారు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల పరిశీలన, పాస్‌ల జారీ మొత్తం మంగళగిరిలోని డీజీపీ కార్యాలయం కేంద్రంగా నడుస్తోంది. దీనికి ప్రత్యేకంగా ఒక నోడల్ అధికారిని నియమించారు.‘ఈ’ పాస్‌ను అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే తీసుకోవాలి. పాస్‌లు అవసరమైనవారు పూర్తి ఆధారాలను, ధ్రువీకరణ పత్రాలను దరఖాస్తుకు జోడించాలి. పోలీసు శాఖ ప్రజారక్షణ కోసం మీ వెంట ఎప్పుడూ ఉంటుంది.
దరఖాస్తు చేసుకోవడం ఎలా ?
citizen.appolice.gov.in వెబ్‌సైట్లో apply ePass for movement during lockdown అనే ఆప్షన్ ఉంటుంది.
దీనిపై క్లిక్ చేయగానే ‘ఈ’ దరఖాస్తు కనిపిస్తుంది. దరఖాస్తుదారు పేరు, ఫోన్ నంబరు, గుర్తింపు ధ్రువీకరణ పత్రం, ఫొటోను అప్‌లోడ్ చేయాలి.
ఏ కేటగిరీ కింద ప్రయాణం చేయాలనుకుంటున్నారో ఆ బాక్స్ వద్ద టిక్ మార్క్ పెట్టాలి.
రాష్ట్రంలోనే ప్రయాణించాలనుకుంటున్నారా? బయటకు వెళ్లాలనుకుంటున్నారా? బయటి రాష్ట్రం నుంచి ఏపీకి రావాలనుకుంటున్నారా? అనే విషయాన్ని స్పష్టం చేయాలి. ఆ బాక్స్ వద్ద టిక్ మార్కు పెట్టాలి.
దరఖాస్తుదారు ప్రస్తుత అడ్రస్, చేరుకోవాల్సిన గమ్యస్థానానికి సంబంధించిన చిరునామాను ఇవ్వాలి. ప్రయాణం ఒకవైపునకు మాత్రమేనా, లేక రెండు వైపులా ప్రయాణం చేస్తారా? అనేది తెలియజేయాలి.
ఇందులో ప్రయాణానికి కారణం కచ్చితంగా తెలియజేయాలి. సొంత వాహనాల్లో వస్తారా? లేక ప్రజారవాణాను ఉపయోగిస్తున్నారా? దరఖాస్తులో వివరించాలి.
అలాగే ఎంతమంది ప్రయాణం చేయాలనుకుంటన్నారో, అందరి పేర్లు, ఫోన్ నం., గుర్తింపు కార్డు నంబర్ ఇవ్వాలి. డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు, ఓటరు గుర్తింపు కార్డు, పాన్‌కార్డు, ఆధార్ కార్డుల్లో ఏదో ఒక దాన్ని ధ్రువీకరణపత్రంగా చూపించాలి.
లక్షణాలు ఉన్నాయా? లేదా? అన్నది స్పష్టం చేయాలి. గతంలో క్వారంటైన్‌లో ఉన్నారా? లేదా? తెలియజేయాలి.
citizen.appolice.gov.in వెబ్‌సైట్‌తోపాటు APPOLICE100(ట్విట్టర్),Andhra Prade-sh Police /@ANDHRAPRADESHSTATEPOLICE (ఫేస్‌బుక్) ద్వారా ఈ పాస్‌ల కోసం సంప్రదించవచ్చు.
దరఖాస్తు రాసి, వారికి సంబంధించిన ధ్రువీకరణపత్రాలను, పాస్‌కు అవసరమైన వివరాలను ట్విట్టర్, ఫేస్‌బుక్‌ల్లో పోస్ట్ చేయవచ్చు. వాటిని పరిశీలించి కారణం సహేతుకంగా ఉంటే పాస్‌ను మంజూరు చేస్తారు.
దరఖాస్తు చేసుకున్న వారికి గంటలోపు పాస్‌లు ఇవ్వాలని పోలీసు యంత్రాంగం భావిస్తోంది.