AP Covid Report: వృద్ధులకు మళ్లీ కరోనా వస్తే చాలా డేంజర్, ఏపీలో కరోనా విశ్వరూపం, తాజాగా 1,184 మందికి కరోనా, నలుగురు మృతితో 7217 కు చేరుకున్న మరణాల సంఖ్య
ఇప్పటివరకు రాష్ట్రంలో 901989 మందికి కరోనా వైరస్ సోకింది. గడచిన 24 గంటల్లో 456 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 8,87,434 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Amaravati, Mar 31: ఏపీలో గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 30,964 కరోనా పరీక్షలు నిర్వహించగా, 1,184 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ (AP Covid Report) అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 901989 మందికి కరోనా వైరస్ సోకింది. గడచిన 24 గంటల్లో 456 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 8,87,434 మంది డిశ్చార్జ్ అయ్యారు.
ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి మొత్తం నలుగురు మృతి (Covid Deaths) చెందగా, ఇప్పటివరకు 7217 మంది మరణించారు. ఏపీలో ప్రస్తుతం 7338 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 1,50,83,179 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 352 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత విశాఖ జిల్లాలో 186, చిత్తూరు జిల్లాలో 115, కృష్ణా జిల్లాలో 113 కేసులు గుర్తించారు. అదే సమయంలో 456 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా, నలుగురు మృత్యువాత పడ్డారు. వారిలో చిత్తూరు జిల్లాకు చెందినవారు ముగ్గురున్నారు.
దేశవ్యాప్తంగా కోవిడ్–19 తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో తిరుమలలో ఆంక్షలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని దానిని ఇంకా పెంచుతామని టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి చెప్పారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, శ్రీవారి ఆలయం, అన్న ప్రసాద కేంద్రం, కళ్యాణకట్టతో పాటు రద్దీగా ఉండే ప్రాంతాల్లో భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని తెలిపారు.
సర్వ దర్శనం టోకెన్లను 22 వేల నుంచి 15 వేలకు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నాం. భక్తులు ఈ మార్పును గమనించాలి.అన్న ప్రసాద కేంద్రం, గదుల కేటాయింపు కౌంటర్ల వద్ద థర్మల్ స్క్రీనింగ్ యంత్రాల ఏర్పాటు. ఊ తిరుమలకు వచ్చే భక్తులు తమ వెంట తప్పనిసరిగా మాస్కులు, శానిటైజర్లు తెచ్చుకోవాలని తెలిపారు.
కరోనా కొత్త వేరియంట్లు వ్యాప్తిలో ఉండడంతో ఒకటి కంటే ఎక్కువసార్లు కరోనా బారినపడే అవకాశాలు ఉన్నాయని, 65 ఏళ్లకు పైబడినవారిలో ఈ పరిణామం విషమ పరిస్థితికి దారితీస్తుందని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి. ఇప్పటికే పలు వ్యాధులతో బాధపడుతూ, వ్యాధినిరోధకశక్తి హీనత కలిగిన వృద్ధులు కరోనా మళ్లీ సోకితే తట్టుకోలేరని డెన్మార్క్ లోని స్టాటెన్స్ సీరమ్ ఇన్ స్టిట్యూట్ పేర్కొంది.
యువత కూడా ఒకటి కంటే ఎక్కువ సార్లు కరోనా బారినపడుతున్న దాఖలాలు ఉన్నాయని, అయితే యువత కంటే ఎక్కువగా వృద్ధులే పదేపదే కరోనా వైరస్ కు గురవుతున్నట్టు డెన్మార్క్ శాస్త్రవేత్తలు వివరించారు. 65 ఏళ్లకు పైబడిన వృద్ధుల్లో కరోనా నుంచి కాపాడుకునే శక్తి 47.1 శాతం మాత్రమేనని, అది కూడా అస్థిరంగా ఉంటుందని వెల్లడించారు. పైగా కాలం గడిచేకొద్దీ వారిలో వ్యాధినిరోధక శక్తి క్షీణిస్తుండడం వంటి అంశాలతో కరోనా వారిపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.