AP Curfew Timings: ఏపీలో కర్ఫ్యూ టైమింగ్స్ మార్పు ఏమీ లేదు, ఇప్పుడు ఉన్న మాదిరిగానే కర్ఫ్యూ సడలింపులు, తప్పుడు కథనాలను ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు, హెచ్చరించిన వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్
కర్ఫ్యూ సమయంలో ఎలాంటి మార్పులు (Curfew Timings in AP) చేయలేదని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని ఏపీ సర్కార్ హెచ్చరించింది.
Amaravati, May 19: కరోనావైరస్‌ను కట్టడి చేయడానికి ఏపీ ప్రభుత్వం కర్ఫ్యూని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ కర్ఫ్యూ విషయానికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ఈ నెల 20 నుంచి కర్ఫ్యూ సమయాల్లో మార్పులు (AP Curfew Timings) జరగనున్నాయని... ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే ఆంక్షల నుంచి మినహాయింపు ఉంటుందనేదే ఆ సమాచారం.
ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం (Andhra Pradesh Govt) స్పందించింది. ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని ప్రకటించింది. కర్ఫ్యూ సమయంలో ఎలాంటి మార్పులు (Curfew Timings in AP) చేయలేదని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని ఏపీ సర్కార్ హెచ్చరించింది.
Here's Tweet
ఇప్పుడు ఉన్న మాదిరిగానే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే కర్ఫ్యూ సడలింపులు ఉంటాయని చెప్పింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఇలాంటి తప్పుడు కథనాలను ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కరోనా కేసులపై ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. సోషల్ మీడియాలో అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని.. రూమర్స్‌ను నమ్మొద్దని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 85 శాతం ఫీవర్ సర్వే పూర్తి అయ్యిందని వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఐసీయూ బెడ్స్ 744, ఆక్సిజన్ బెడ్లు 551 అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఏపీలో ఎక్కడా బెడ్స్ కొరత లేదన్నారు. ఫీవర్ సర్వేలో 90 వేల మంది కరోనా అనుమానితులను గుర్తించామన్నారు. కరోనా ట్రీట్మెంట్ ప్రొటోకాల్‌లో ప్లాస్మా థెరపీని పెట్టలేదని.. ప్లాస్మా థెరపీని ప్రోత్సహించవద్దని జిల్లా అధికారులకు సూచిస్తున్నామని పేర్కొన్నారు. ‘‘రెమిడిసివిర్ ఇంజెక్షన్లు దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకుంటున్నాం. బ్లాక్ ఫంగస్ చికిత్సకు కావాల్సిన మెడిసిన్ కొరత ఉంది. అవసరమైన మేరకు తెప్పిస్తున్నాం. త్వరలోనే సమస్యను అధిగమిస్తామని’’ ఎ.కె.సింఘాల్ పేర్కొన్నారు.