Hyderabad, May 17: నరసపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వైద్య పరీక్షల పర్యవేక్షణ కోసం జ్యుడిషియల్ అధికారిని తెలంగాణ హైకోర్టు నియమించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జ్యుడిషియల్ రిజిస్ట్రార్ నాగార్జునను హైకోర్టు నియమించింది. ఈ మేరకు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి జ్యుడిషియల్ అధికారి (Telagana High Court Appointed Judicial Registrar) చేరుకున్నారు. సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో ఎంపీ రఘురామ కృష్ణం రాజుకు వైద్య పరీక్షలు( Raghurama’s Medical Tests) ప్రారంభమయ్యాయి.
రఘురామకృష్ణరాజుకు ముగ్గురు ఆర్మీ వైద్యుల బృందం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ వైద్య పరీక్షలను అధికారులు వీడియో తీస్తున్నారు. మెడికల్ నివేదికను సీల్డ్ కవర్‌లో న్యాయాధికారి సుప్రీంకోర్టుకు సమర్పించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం తరువాత ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులకు సమాచారం ఇస్తామని వైద్యులు తెలిపారు. జ్యూడిషల్ కస్టడీలో ఉన్న ఎంపీని ఎవరు కలవడానికి వీలు లేదని ఆర్మీ అధికారులు స్పష్టం చేశారు. 21 వరకు మిలటరీ ఆస్పత్రిలోనే వైద్య చికిత్సలు జరుగనున్నాయి. 21న ఆరోగ్య పరిస్థితి, వీడియో గ్రఫి, స్టేట్మెంట్‌ను అధికారులు షీల్డ్ కవర్‌లో ఉంచి సుప్రీం కోర్టుకు అందజేయనున్నారు.
కాగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్ర కేసులో అరెస్టయిన (Raghurama Krishnam Raju case) ఎంపీ రఘురామకృష్ణరాజుకు బెయిలు ఇచ్చేందుకు సోమవారం సుప్రీంకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. తనకు రమేశ్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలన్న ఆయన విజ్ఞప్తిని కూడా తోసిపుచ్చి.. రఘురామకృష్ణరాజును సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రికి తరలించి తెలంగాణ హైకోర్టు నియమించే జ్యుడిషియల్ అధికారి పర్యవేక్షణలో వైద్య పరీక్షలు జరపాలని ఆదేశించింది.
ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో చిత్రీకరించి తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ద్వారా సీల్డ్ కవర్‌లో తమకు నివేదిక పంపాలని పేర్కొంది. దీనిపై ఈనెల 19వ తేదీలోగా కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.