Amaravati, May 17: రఘురామకృష్ణరాజు కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసింది.రఘురామ రాజుకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో ముగ్గురు వైద్యులతో బోర్డు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు చేయాలని సుప్రీం కోర్టు సూచించింది. జ్యుడీషియల్ కస్టడీలో భాగంగానే రఘురామకృష్ణరాజుకు (Raghu Rama Krishnam Raju) వైద్య పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. జ్యుడీషియల్ అధికారిని నియమించాలని తెలంగాణ హైకోర్టుకు (TS High Court) సుప్రీంకోర్టు (Supreme court of India) సూచించింది.
జ్యుడీషియల్ అధికారి సమక్షంలో వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు తెలిపింది. వైద్య ఖర్చులను మొత్తం రఘురామకృష్ణరాజే భరించాలని పేర్కొంది. వైద్య పరీక్షలను వీడియోతో చిత్రీకరించాలని సూచించింది. సీల్డ్ కవర్‌లో నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
అలాగే రఘురామకు వై కేటగిరీ భద్రతను కొనసాగించాలని సూచించింది. ఎంపీకి వైద్య పరీక్షల నిర్వహణ జరిగే కాలాన్ని జ్యుడిషియల్ కస్టడీగా పరిగణించాలని సుప్రీం కోర్టు సూచించింది. ఈ ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా పాటించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ధర్మాసనం మే 21కి వాయిదా వేసింది. సుప్రీం ఆదేశాలతో ఎంపీ రఘురామకృష్ణం రాజును నేడు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తరలించనున్నారు.
రఘురామకృష్ణరాజు పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. రఘురామకృష్ణరాజును కస్టడీలో కొట్టారన్న ఆరోపణలు అవాస్తవమని సుప్రీంకోర్టుకు సీఐడీ లాయర్ దుష్యంత్ దవే తెలిపారు. సీనియర్ జ్యుడీషియల్ అధికారి సమక్షంలో వైద్య పరీక్షలకు సిద్ధమని పేర్కొన్నారు. సమీపంలో ఆర్మీ ఆస్పత్రులున్నాయా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించగా, 300 కి.మీ. దూరంలో సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి ఉందని, విశాఖలో నేవీ ఆస్పత్రి కూడా 300 కి.మీ దూరంలో ఉందని లాయర్ రావు తెలిపారు. విశాఖలో తుఫాను పరిస్థితులున్నాయని.. కేంద్రం ఆధీనంలోని మంగళగిరి ఎయిమ్స్ అన్నింటికంటే దగ్గరగా ఉందని లాయర్ దవే వివరించారు. రఘురామకృష్ణరాజుకు ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలకు అభ్యంతరం లేదన్నారు. వాదనలు విన్న కోర్టు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. వాదనలు శుక్రవారం వింటామని సుప్రీంకోర్టు తెలిపింది.