Eluru Corporation Election Results: ఏలూరు కార్పోరేషన్ ఎవరి ఖాతాలోకి, ఇప్పటికే 3 వైసీపీ కైవసం, మిగతా 47 స్థానాల్లో కొనసాగుతున్న కౌంటింగ్, మధ్యాహ్నం 12 గంటల కల్లా తుది ఫలితాలు
ఏలూరు శివారులోని సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపునకు అధికారులు ఇప్పటికే పటిష్ట ఏర్పాట్లు చేశారు. 47 డివిజన్లకు 48 టేబుల్స్‌పై ఒకే రౌండ్‌లో ఫలితాలు వెల్లడి కానున్నాయి.
Eluru, July 25: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఫలితాల (Eluru Municipal Corporation Election Results) కౌంటింగ్ కొనసాగుతోంది. ఏలూరు శివారులోని సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపునకు అధికారులు ఇప్పటికే పటిష్ట ఏర్పాట్లు చేశారు. 47 డివిజన్లకు 48 టేబుల్స్‌పై ఒకే రౌండ్‌లో ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 12 గంటలకల్లా పూర్తై తుది ఫలితాలు (Eluru Corporation Election Results 2021) వెల్లడికాన్నాయి. ఈ మేరకు అధికారులు కౌంటింగ్ కేంద్రంలో నాలుగు లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం నాటికి ఫలితాలు వెలువడనున్నాయి. అనంతరం ఈ నెల 30న మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరగనుంది.
నలుగురు సీనియర్ ఆఫీసర్లను నాలుగు కౌంటింగ్ హాళ్లకు సూపర్ వైజర్లుగా నియమించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద సీసీటీవీ కెమెరా, వీడియోగ్రఫీతో పర్యవేక్షిస్తున్నారు. కౌంటింగ్ సిబ్బంది అందరికీ కోవిడ్ టెస్టులు, మాస్క్, ఫేస్ షీల్డ్ లేనిదే కౌంటింగ్ హాలులోకి అనుమతి నిరాకరిస్తామని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని అధికారులు తెలిపారు. కౌంటింగ్ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. కౌంటింగ్ ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లో ఉంది.
మొత్తం 50 డివిజన్లకు గాను 3 ఏకగ్రీవం అయ్యాయి. ఈ 3 ఏకగ్రీవ డివిజన్లు ఇప్పటికే వైసీపీ ఖాతాలోకి వెళ్లాయి. ఇంకా 47 స్థానాల్లో అభ్యర్థుల భవితవ్యం మరికాసేపట్లో తేలనుంది. వైసీపీ 47 స్థానాల్లో పోటీచేయగా.. టీడీపీ 43 స్థానాల్లో, 20 చోట్ల జనసేన, ఇతర అభ్యర్థులు కలిపి మొత్తం 171 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
గత మార్చి 10న ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించారు. ఈ కార్పోరేషన్ పరిధిలో 56.86 పోలింగ్ శాతం నమోదైంది. కోర్టు కేసుల నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియను వాయిదా వేశారు. ఓటర్ల జాబితాలో తప్పులున్నట్లు ఎన్నిక కౌంటింగ్‌పై సింగిల్ జడ్జి నేతృత్వంలోని ధర్మాసనం గతంలో స్టే విధిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వంతోపాటు టీవీ అన్నపూర్ణ శేషుకుమారి అనే అభ్యర్థి వేర్వేరుగా ధర్మాసనం ముందు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన ధర్మాసనం ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు అనుమతిచ్చి, ఫలితాలను వెల్లడించవద్దంటూ గతంలో మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. మేలో జరిగిన విచారణలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగించవచ్చని పేర్కొంటూ హైకోర్టు తీర్పునివ్వడంతో అధికారులు కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు చేశారు.