YSR Kadapa, July 24: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఈ హత్య కేసులో (Y. S. Vivekananda Reddy Murder Case) కీలక సాక్షిగా భావిస్తున్న వాచ్‌మెన్ రంగన్న (65) వాంగ్మూలాన్ని సీబీఐ రికార్డు చేయించింది. పులివెందులలోని భాకరాపురానికి చెందిన ఇతను చాలా కాలంగా వైఎస్ వివేకానందరెడ్డి ఇంటి వద్ద వాచ్‌మెన్‌గా పని చేసేవాడు. విచారణలో భాగంగా ఇదివరకు ఇతనికి సిట్ బృందం నార్కో అనాలసిస్ టెస్ట్ కూడా చేయించింది.
కాగా తాజా విచారణలో భాగంగా ఈ నెల 6 నుంచి 16వ తేదీ వరకు విచారించిన సీబీఐ.. ఇదే నెలలో 21, 22, 23 తేదీల్లో వరుసగా మూడు రోజులపాటు విచారించింది. 22వ తేదీ ఉదయం 10 గంటలకు జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రిలో ఇతనికి కోవిడ్ టెస్ట్ చేయించారు. నెగెటివ్ రిపోర్టు రావడంతో శుక్రవారం ఉదయం 11.45 గంటలకు జమ్మలమడుగు కోర్టులో మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. మధ్యాహ్నం 2.55 గంటల వరకు ఇతను మేజిస్ట్రేట్ సమక్షంలోనే ఉన్నాడు.
ఈ సమయంలో మేజిస్ట్రేట్ ఇతని వాంగ్మూలం నమోదు (CBI Records Watchman Ranganna Statement) చేసినట్లు తెలిసింది. 3 గంటలకు సీబీఐ బృందం తిరిగి రంగన్నను అదుపులోకి తీసుకొని రాత్రి 8.40 గంటలకు పులివెందుల బస్టాండులో వదిలిపెట్టింది. కోర్టులో ఇతని వాంగ్మూలం రికార్డు చేసే సమయంలో సీబీఐ అధికారులు బయటే ఉన్నారు. 2019 మార్చి 14 అర్ధరాత్రి వివేకా తన ఇంట్లోనే అత్యంత దారుణంగా హత్యకు (YS Vivekananda Reddy murder) గురైన సంగతి తెలిసిందే.
వివేకా(YS Vivekananda Reddy) హత్య కేసు నిగ్గు తేల్చేందుకు నాటి చంద్రబాబు ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైయస్ జగన్ ప్రభుత్వం మరో రెండు సిట్‌లు వేసింది. ఈ పరిస్థితుల మధ్య.. నెలలు గడిచినా దర్యాప్తులో పురోగతి లేదని, దీనిపై పలు అనుమానాలు ఉన్నాయని, సీబీఐకి అప్పగించాలని వివేకా కుమార్తె సునీత హైకోర్టును ఆశ్రయించారు. దీంత గతేడాది మార్చి 11న ఈ కేసు దర్యాప్తు ను సీబీఐకి ఇస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఆదేశాలతో 2020 జూలై 18న సీబీఐ రంగంలో దిగింది. అయితే కరోనా విజృంభణతో విచారణకు బ్రేక్ పడింది.
ఈ ఏడాది జూన్ 6 నుంచి డీఐజీ సుధాసింగ్ నేతృత్వంలో సీబీఐ బృందం కడప సెంట్రల్ జైల్ గెస్ట్‌హౌస్‌లో రెండో విడత విచారణ చేపట్టింది. పలు దఫాలు దాదాపు 35-40 మందిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. వీరిలో వాచ్‌మన్ రంగయ్యతో పాటు వివేకా ప్రధాన అనుచరుడు ఎర్రగంగిరెడ్డి, పీఏ కృష్ణారెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ ఇనాయతుల్లా, మాజీ డ్రైవర్ దస్తగిరి, పులివెందుల కు చెందిన వైసీపీ కార్యకర్త కిరణ్‌కుమార్ యాదవ్, ఈయన సోదరుడు సునీల్‌కుమార్‌యాదవ్, తల్లిదండ్రులు కృష్ణయ్య, సావిత్రి, సోదరి నందిని, మైనింగ్ వ్యాపారి గువ్వల గంగాధర్, కడపలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి యజమాని లక్ష్మిరెడ్డి తదితరులు ఉన్నారు.
వివేకా హత్య కేసు దర్యాప్తు కొనసాగుతున్న వేళ దాని పర్యవేక్షకాధికారిణి, డీఐజీ సుధాసింగ్‌ను సీబీఐ బదిలీ చేసింది.ఆయె స్థానంలో కొత్తగా సీబీఐ అధికారి రాంకుమార్‌ను నియమించారు. ఇది సాధారణ బదిలీల్లో భాగంగానే జరిగిందని ఢిల్లీ సీబీఐ తెలిపింది. ముందు ముందు ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.