Kadapa,October 13: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన మాజీ ఎంపీ, ఏపీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరికొన్ని నిజాలు వెలుగులోకి వచ్చినట్లుగా సోషల్ మీడియాలో అనేక కథనాలు వినిపిస్తున్నాయి. ప్రొద్దుటూరుకు చెందిన సునీల్ గ్యాంగ్ ఈ హత్యకు పాల్పడినట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ కేసులో అనుమానితుడు శ్రీనివాస్ రెడ్డి అనుమానాస్పద మృతిపై దర్యాప్తు చేస్తున్న తరుణంలో ఈ విషయాలు వెలుగుచూశాయని ఆ వార్తల సారాంశంగా తెలుస్తోంది.
కాగా వివేకా హత్య కేసులో అనుమానితుడిగా భావిస్తున్న శ్రీనివాస్ రెడ్డి ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో అనుమానాలు పెరిగాయి. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను పోలీసులు ఖండించారు. ఈ వార్తలను నమ్మవద్దని పోలీసులు తెలిపారు. సుఫారీ గ్యాంగ్ ఉన్నట్లుగా మేము ఎక్కడా చెప్పలేదని తేల్చి చెప్పారు. ఈ రకమైన ప్రచారం చేస్తే వారిని జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.
కాగా ఈ ఏడాది మార్చిలో పులివెందులో తన నివాసంలో వివేకా హత్యకు గురయ్యారు. మొదట గుండెపోటుతో ఆయన మరణించారని భావించినప్పటికీ ఒంటిపై ఉన్న గాయాలు, పోస్ట్ మార్టం నివేదికలో ఆయనది హత్య అని నిర్ధారణ అయ్యింది. దీంతో అప్పటి నుంచి పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. దీని పైన రాజకీయంగా అనేక ఆరోపణలు చోటు చేసుకున్నాయి. ఈ హత్య కేసు తేల్చాలని ముఖ్యమంత్రి జగన్ స్వయంగా డీజీపీని ఆదేశించారు. దీంతో..ఆయన స్వయంగా పులివెందులకు వెళ్లి సిట్ అధికారులతో సమావేశమయ్యారు.