Amaravati, March 12: దివంగత వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసును (YS Vivekananda Reddy Murder Case) కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) కు అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High Court) ఆదేశాలు జారీచేసింది. హత్య జరిగి ఏడాది కావస్తున్నా కేసు దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదని హైకోర్ట్ అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసు దర్యాప్తులో 'కాలం' కీలకం కాబట్టి ఈ కేసును సీబీఐకి బదిలీ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. వీలైనంత త్వరగా కేసును ఛేదించాలని సీబీఐకి కోర్ట్ సూచించింది.
వైఎస్ వివేకానంద రెడ్డి 2019 మార్చి 15న వారి స్వస్థలమైన పులివెందులలో ఆయన నివాసంలోనే దారుణ హత్యకు గురయ్యారు. అప్పట్లో ఏపి ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కేసును సీబీఐకు అప్పగించాలని టీడీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదే విషయమై హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు, అయితే జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన తన పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హంతకులు దొరికారంటూ సోషల్ మీడియాలో వార్తలు
అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఈ హత్య కేసును దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందంను (SIT) ఏర్పాటు చేసింది. తరువాత అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నేతృత్వంలో మరో సిట్ కూడా ఏర్పాటు చేయబడింది. పోలీసులు 1,300 మంది అనుమానితులను విచారించారు. ఘటనాస్థలంలో సాక్ష్యాధారాలను తారుమారు చేశారన్న అభియోగంతో ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురికి నార్కో పరీక్షలు కూడా నిర్వహించారు. అయితే ఘటన జరిగి 11 నెలలు కావొస్తున్న ఇంతవరకు అసలు నేరస్తులు ఎవరనేది తేలలేదు.
దీంతో వివేకా భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత ఈ కేసును సీబీఐకి అప్పగించాలని పిటిషన్ దాఖలు చేశారు, తమ పిటిషన్ లో 15 మంది నిందితుల పేర్లను పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై పలుమార్లు విచారణ చేపట్టిన హైకోర్ట్, తాజాగా సీబీఐకి విచారణకు ఆదేశించింది.