New CJ to AP High Court: ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్ గోస్వామి, ఆమోదముద్ర వేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, సిక్కిం హైకోర్టుకు బదిలీ అయిన జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, పదవీ విరమణ చేసిన హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి రాకేష్ కుమార్
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్ గోస్వామి నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. ఇందుకు సంబంధించిన గెజిట్‌ను కేంద్ర న్యాయశాఖ గురువారం విడుదల చేసింది. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరీ బదిలీపై కూడా కేంద్ర న్యాయశాఖ సంయుక్త కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు.
Amaravati, Jan 1: ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్ గోస్వామి నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. ఇందుకు సంబంధించిన గెజిట్‌ను కేంద్ర న్యాయశాఖ గురువారం విడుదల చేసింది. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరీ బదిలీపై కూడా కేంద్ర న్యాయశాఖ సంయుక్త కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో చర్చల అనంతరం రాష్ట్రపతి (President of India Ramnath Kovind) ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఏపీ హైకోర్టు, సిక్కిం హైకోర్టు అధికారులకు జారీ చేసిన నోటిఫికేషన్ వివరాలు ఇందులో పొందుపరిచారు. సిక్కిం హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు స్వీకరించాలని జస్టిస్ మహేశ్వరీకి (Chief Justice Maheshwari) సూచించారు. సిక్కిం హైకోర్టుకు బదిలీ అయిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి జనవరి 4న అక్కడ ప్రమాణం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
హైకోర్టుకు (Andhra Pradesh High Court) కొత్త న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ అరూప్ గోస్వామి (Justice Arup Goswami) 1961 మార్చి 11న అసోంలోని జోర్హాట్‌లో జన్మించారు. గువాహటి ప్రభుత్వ న్యాయకళాశాల నుంచి 1985లో న్యాయశాస్త్ర పట్టా పొందారు.1985 ఆగస్టు 16న న్యాయవాదిగా తన పేరు నమోదు చేసుకున్నారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగం, ఉద్యోగ సేవలకు సంబంధించిన విభిన్న కేసులను ఆయన వాదించారు. గువాహటి హైకోర్టులో 2011లో అదనపు న్యాయమూర్తిగా, 2012లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
2019 అక్టోబరు 15న పదోన్నతిపై సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు 2004 డిసెంబరు 21న గువాహటి హైకోర్టు నుంచి సీనియర్ అడ్వొకేట్ హోదా పొందారు. 2011 నుంచి 2013 వరకు నాగాలాండ్ రాష్ట్ర న్యాయసేవా సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా వ్యవహరించారు. 2018 నుంచి రెండుసార్లు గువాహటి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. ఇప్పుడు ఏపీ హైకోర్టు సీజేగా నియమితులయ్యారు.
ఇక ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి సిక్కిం హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 222 క్లాజ్ (1) కింద రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. ఆయన బదిలీని ధృవీకరించినట్లు తెలిపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బొబ్డేను సంప్రదించిన తరువాతే రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దీంతో పాటుగా మరో న్యాయమూర్తి జస్టిస్ రాకేష్ కుమార్ పదవీ విరమణను సైతం కేంద్రం నోటిఫై చేసింది. జస్టిస్ రాకేష్ కుమార్ స్థానంలో జోయ్‌మాల్యా బాగ్చీని నియమించారు.
కోల్‌కత హైకోర్టు న్యామమూర్తిగా ప్రస్తుతం ఆయన పనిచేస్తున్నారు. అదే సమయంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లీ నియామకాన్ని కూడా కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న ఆమెను పదోన్నతి కల్పించి.. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించింది. తెలంగాణ చీఫ్ జస్టిస్‌గా రాఘవేంద్ర సింగ్ చౌహాన్‌ను కోల్‌కతకు బదిలీ చేశారు.
ఇక రాష్ట్ర హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్‌కుమార్ ( Justice Rakesh kumar) గురువారం పదవీ విరమణ చేశారు. గత ఏడాది నవంబర్ 9న పాట్నా హైకోర్టు నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చిన ఆయన 13 నెలల పాటు ఇక్కడ ఉన్నారు. పదవీ విరమణ అనంతర కార్యక్రమం తరువాత గురువారం రాత్రే ఆయన కుటుంబ సమేతంగా తన స్వస్థలం పాట్నాకు వెళ్లిపోయారు. ప్రతి న్యాయమూర్తి పదవీ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసే అధికారిక వీడ్కోలు కార్యక్రమాన్ని కరోనా నేపథ్యంలొ హైకోర్టు ఈసారి ఏర్పాటు చేయలేదు.
ప్రధాన న్యాయమూర్తి కోర్టు హాలులో న్యాయమూర్తులంతా సమావేశం కావడం సంప్రదాయంగా వస్తోంది. కరోనా నేపథ్యంలో ఈ వీడ్కోలు కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు నిర్వహించింది. అయితే తనకు అధికారిక వీడ్కోలు కార్యక్రమం వద్దని జస్టిస్ రాకేశ్‌కుమారే తిరస్కరించినట్లు హైకోర్టు వర్గాలు చెబుతున్నాయి. దీంతో న్యాయమూర్తులు జడ్జిల లాంజ్‌లోనే జస్టిస్ రాకేశ్ కుమార్ దంపతులను సత్కరించారు. జస్టిస్ రాకేశ్‌కుమార్ కారులో వెళుతూ రోడ్డుకు ఇరువైపులా నిల్చున్న అమరావతి రైతుల్ని చూసి కారును స్లో చేసి, కారు తలుపు తీశారు. దీంతో రైతులు ఆయన వద్దకు వెళ్లి కండువాలతో సత్కరించి, జ్ఞాపికలు బహూకరించారు. ఆయన నవ్వుతూ వాటిని స్వీకరించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా విమానాశ్రయానికి వెళ్లిపోయారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)