Heavy Rains: ప్రకాశం, నెల్లూరు సహా పలు జిల్లాలకు అతి భారీ వర్ష సూచన.. పిడుగులు పడతాయని హెచ్చరిక.. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడి
కోస్తాను ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా, తూర్పు మధ్య బంగాళాఖాతం నుంచి కోస్తా, రాయలసీమ మీదుగా కర్ణాటక వరకు మరో ద్రోణి విస్తరించినట్టు వాతావరణశాఖ పేర్కొంది.
Vijayawada, September 30: ఏపీలో (AndhraPradesh) నేడు, రేపు భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో (Bay of Bengal) ఉపరితల ఆవర్తనం, కోస్తా, రాయలసీమ మీదుగా కర్ణాటక వరకు మరో ద్రోణి విస్తరించినట్టు వాతావరణశాఖ పేర్కొంది. ఈ కారణంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారాయని తెలిపింది. ఈ ప్రభావంతో నేడు, రేపు కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వివరించింది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనుండగా, మిగిలిన జిల్లాలో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని తెలిపింది.
రేపు (శనివారం) దక్షిణ కోస్తాలో అనేక చోట్ల, ఉత్తర కోస్తాలో పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వాతావరణంలో అనిశ్చితి నెలకొని ఉందని, పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున చెట్లు, ఆరుబయట ప్రాంతాల్లో ఉండొద్దని అధికారులు తెలిపారు. కాగా, కోస్తా, రాయలసీమల్లో నిన్న కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.