Tirumala Horror: తిరుమలలో బాలుడిని నోట కరిచి ఎత్తికెళ్లిపోయిన చిరుత.. సినీ ఫక్కీలో వెంబడించిన స్థానికులు, తల్లిదండ్రులు.. బాలుడిని వదిలివెళ్లిపోయిన చిరుత..గాయాలపాలైన బాలుడికి ఆసుపత్రిలో చికిత్స.. ప్రాణాపాయం లేదన్న వైద్యులు
అలిపిరి నడక దారిలో గురువారం జరిగిన చిరుత దాడిలో ఓ నాలుగేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించడంతో బాలుడికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది.
Tirumala, June 23: తిరుమలలో (Tirumala) ఘోరం జరిగింది. అలిపిరి (Alipiri) నడక దారిలో గురువారం జరిగిన చిరుత దాడిలో (Leopard Attack) ఓ నాలుగేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించడంతో బాలుడికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. అసలేమైంది అంటే.. కర్నూలు జిల్లా (Kurnool District) అదోనికి చెందిన దంపతులు తమ కుమారుడు కౌశిక్(4)ను తీసుకుని నడక దారిలో తిరుమలకు బయలుదేరారు. ఆ తరువాత మొదటి ఘాట్ రోడ్డులోని ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం వద్ద భోజనం కోసం ఆగారు. బాలుడేమో ఆ పక్కనే ఆడుకుంటున్నాడు. ఇంతలో వెనక నుంచి వచ్చిన ఓ చిరుత బాలుడిని నోట కరుచుకుని అడవిలోకి లాక్కెళ్లిపోయింది.
చిరుతను వెంబడించారు
జరిగిన హఠాత్పరిణామానికి షాక్ కి గురైన పేరెంట్స్ వెంటనే తేరుకొన్నారు. బాలుడి తల్లిదండ్రులతో పాటు స్థానికులు, భద్రతాసిబ్బంది పెద్దపెట్టున కేకలు వేస్తూ చిరుతను వెంబడించారు. టార్చిలైట్లు, వేస్తూ రాళ్లు రువ్వుతూ, కేకలు వేస్తూ చిరుతను బెదిరించారు. దీంతో, కంగారు పడ్డ చిరుత బాలుడిని పోలీస్ ఔట్‌పోస్ట్ వద్ద వదిలేసి వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడ్డ బాలుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. చిన్నారి చెవి వెనుక భాగం, తలపై పలు చోట్ల గాయాలను వైద్యులు గుర్తించి చికిత్స అందించారు. బాలుడి ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు పేర్కొన్నారు.