Mystery Disease in AP: మిస్టరీ వ్యాధిని కనిపెట్టేందుకు ఏలూరు చేరుకున్న డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి బృందం, 475కు చేరుకున్న బాధితుల సంఖ్య, 332 మంది కోలుకుని డిశ్చార్జ్, బాధితుల శరీరంలో లెడ్ హెవీ మెటల్, నికెల్ పదార్ధాలు

వారిలో 332 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ కాగా.. 125 మంది ఏలూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక మరో 18 మందిని మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించారు. మొత్తం బాధితుల్లో 253 మంది పురుషులు కాగా.. 222 మంది మహిళలు ఉన్నారు.

AP CM YS Jagan in Eluru (Photo-ANI)

Eluru, Dec 8: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని వ్యాధి (Mystery Disease in Andhra Pradesh Eluru) బారిన పడిన వారి సంఖ్య సోమవారం రాత్రి 10 గంటల సమయానికి 475కు చేరుకుంది. వారిలో 332 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ కాగా.. 125 మంది ఏలూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక మరో 18 మందిని మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించారు. మొత్తం బాధితుల్లో 253 మంది పురుషులు కాగా.. 222 మంది మహిళలు ఉన్నారు.

అయితే వ్యాధికి (Andhra Pradesh Eluru disease) కారణం ఏంటనేది మాత్రం అంతుచిక్కడం లేదు. కాగా పెస్టిసైడ్, ఇ–కోలి పరీక్షల రిజల్ట్స్‌ రావాల్సి ఉంది. అధికార యంత్రాంగం మొత్తం ఏలూరులోనే మోహరించి వ్యాధి ఏమిటనేది తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రతినిధి బృందం సైతం ఏలూరుకు చేరుకుంది. ఈ బృందం మూడు రోజుల పాటు నగరంలో పర్యటించి వ్యాధిపై అధ్యయనం చేయనుంది. ఇప్పుడు వచ్చిన నివేదికలన్నీ తాత్కాలికమైనవని, తుది దశ నిర్ధారణకు పంపామని ఏలూరు ఆస్పత్రి సూపరింటెండెంట్ ఏవీఆర్ మోహన్ తెలిపారు. వింత రోగానికి కారణం న్యూరో టాక్జిన్స్‌గా భావిస్తున్నామన్నారు. కాగా డిశ్చార్జ్‌ అయిన వారిలో ముగ్గురు రోగులు మళ్లీ ఆస్పత్రికి వచ్చారు.

ఏలూరుకు చేరుకున్న ఏపీ సీఎం, అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన వైయస్ జగన్, అధికారులతో సమీక్ష సమావేశం

ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్‌ కాటంనేని భాస్కర్‌తోపాటు వైద్య శాఖ ఉన్నతాధికారులు, వైద్య నిపుణులు ఏలూరులోనే ఉంటూ పర్యవేక్షిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్‌ కాటంనేని భాస్కర్, కలెక్టర్‌ ఆర్‌.ముత్యాలరాజుతో కలిసి తాజా పరిస్థితిపై ప్రభుత్వాస్పత్రిలో సోమవారం రాత్రి సమీక్షించారు. ప్రభుత్వాస్పత్రిలో 9 వార్డుల్లో 250 బెడ్లు సిద్ధంగా ఉన్నాయని, మరో 50 బెడ్లు సైతం అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

వైద్యులకు సవాల్‌గా మారిన ఏలూరులో అంతుచిక్కని వ్యాధి, అస్వస్థతకు గురైన వారిలో ఒకరు మృతి

ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వైద్య సేవలందిస్తూ భరోసా కల్పించేందుకు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. నగరంలోని 62 వార్డు సచివాలయాలతోపాటు మొత్తం 84 చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఏలూరు నుంచి విజయవాడ, గుంటూరు జీజీహెచ్‌లకు తరలించే రిఫరల్‌ కేసులను పర్యవేక్షించేందుకు ఒక నోడల్‌ అధికారిని నియమించారు. మంగళవారం నుంచి 32 డివిజన్లలో సూపర్‌ శానిటైజేషన్‌ చేసేలా చర్యలు తీసుకున్నారు.

తాగునీటి పైపులు ఏమైనా లీకేజీలుంటే అరికట్టడం, డ్రైనేజీ వ్యవస్థలో లోపాలను సరిచేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో అంబులెన్సులు ఉండేలా ఏర్పాట్లు చేశారు. విజయవాడలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.శివశంకరరావు తెలిపారు.

అంతుపట్టని వ్యాధితో వణుకుతున్న ఏలూరు, ఫిట్స్‌ మాదిరి నోటి వెంట నురగతో పడిపోతున్న ప్రజలు, భయపడాల్సిందేమి లేదని తెలిపిన వైద్యులు

బాధితుల శరీరంలో లెడ్ హెవీ మెటల్, నికెల్ పదార్ధాలు ఉన్నట్లు ఎయిమ్స్ నిపుణుల బృందం గుర్తించింది. తాగునీరు లేదా పాల ద్వారా శరీరంలో చేరి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా వీరి నివేదిక అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది. న్యూరో టాక్జిన్స్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. తినే ఆహారం లేదా తాగునీరు లేదా పాలే వింతరోగానికి కారణంగా అనుమానిస్తున్నారు.

నాడీ వ్యవస్థపై న్యూరో టాక్జిన్స్ ప్రభావం చూపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బాధితుల్లో కంటికి సంబంధించి నల్లగుడ్డు స్పందన తగ్గిన లక్షణాన్ని వైద్యులు గుర్తించారు. వైద్య పరిభాషలో ప్యూపిల్ డైలటేషన్‌గా వైద్యులు పేర్కొంటున్నారు. మయో క్లోనిక్ ఎపిలెప్సీ కావచ్చని గుంటూరు వైద్య నిపుణుల బృందం చెబుతోంది. నివేదికల ప్రకారం తాగునీరు కలుషితం కావడమే ప్రధాన కారణంగా అనుమానాలు బలపడుతున్నాయి.

బాధితులను పరామర్శించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

అంతుచిక్కని వ్యాధితో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సోమవారం ఉదయం 10.20 గంటలకు ఏలూరు జిల్లా కేంద్ర ఆసుపత్రికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్‌ బాధితులతో దాదాపు గంటసేపు ప్రత్యేకంగా మాట్లాడారు. వారి వద్దకు వెళ్లి వారి మంచంపైనే కూర్చొని అందర్నీ పలకరించారు.

బాధితులు ఎలా అస్వస్థతకు గురయ్యారు? ఎలాంటి లక్షణాలు కనిపించాయి? ప్రస్తుతం ఎలా ఉంది? వైద్యం ఎలా అందుతోంది? ఆస్పత్రిలో సదుపాయాలు ఎలా ఉన్నాయి? అని వాకబు చేశారు. బాధితులు ఒక్కొక్కరి వద్దకు వెళ్లి ఆత్మీయంగా పలకరించి ఆందోళన చెందవద్దని, పూర్తి స్థాయిలో వైద్య చికిత్స అందచేస్తామని ధైర్యాన్ని కల్పించారు. అత్యున్నత వైద్య నిపుణులు, పరిశోధక బృందాలను రప్పించామని ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని స్వయంగా సీఎం భరోసానివ్వడం బాధితులకు కొండంత ఊరటనిచ్చింది.