AP Weather: ఆంధ్రప్రదేశ్ కు భారీ వర్షసూచన, ఈ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్, నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్
నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, సముద్రం నుంచి తమిళనాడుతో పాటు పరిసర ప్రాంతాలపైకి తూర్పు గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ గాలుల ప్రభావంతో దక్షిణ కోస్తాలో అక్కడక్కడా వర్షాలు (Rains) కురుస్తాయని తెలిపింది.
Vijayawada, DEC 17: వాతావరణ శాఖ ఏపీకి మరోసారి ఆరెంజ్ అలర్ట్ (Orange alert) జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, సముద్రం నుంచి తమిళనాడుతో పాటు పరిసర ప్రాంతాలపైకి తూర్పు గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ గాలుల ప్రభావంతో దక్షిణ కోస్తాలో అక్కడక్కడా వర్షాలు (Rains) కురుస్తాయని తెలిపింది. ఈ ప్రభావం దక్షిణ కోస్తా(South Coast), రాయలసీమ (Rayalaseema) ల్లో భారీ వర్షాలకు కారణమవుతుందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం ఉంటుందని, మరో 24 గంటల్లో నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, శ్రీసత్యసాయి, బాపట్ల, గుంటూరు, ప్రకాశం, తిరుపతి, కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించారు.
రాష్ట్రంపైకి వీస్తున్న పొడిగాలులతో కోస్తా, రాయలసీమల్లోని ఏజెన్సీ ప్రాంతం, శివారు ప్రాంతాల్లో చలి పులి పంజా విసురుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒకటి, రెండు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. పాడేరు, చింతపల్లి, అరకు ప్రాంతాల్లో రాత్రి నుంచి ఉదయం వరకు పొగ మంచు కమ్మేస్తోందని వివరించారు. మిగ్‌జాం తుఫాన్ ప్రభావంతో పలు ప్రాంతాల్లో చలి వాతావరణం పెరిగింది. చల్లటి గాలులకు తోడు పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉండడంతో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి.