Pawan Kalyan: వైసీపీపై పవన్ కల్యాణ్ సంచలన ఆరోపణలు, కోనసీమ అల్లర్లు వైసీపీ కుట్ర, కులాల పేరుతో ప్రజల్ని విభజిస్తోందని మండిపాటు, పొత్తులపై మరోసారి క్లారిటీ ఇచ్చిన జనసేనాని
జనసేన సిద్ధాంతాలు కలిగిన పార్టీ. కుల నిర్మూలన ఉంటేనే సమాజం బావుంటుందని నమ్మే పార్టీ. భారత దేశం కులాలతో నిర్మితమైన దేశం. భారత దేశ రాజకీయాలు కులాలతో ముడిపడిపోయి ఉన్నాయి.
Amrawathi, June 04: మంగళగిరి జనసేన (Janasena) పార్టీ కార్యాలయంలో జనసేన విస్తృతస్థాయి సమావేశంలో జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పాల్గొన్నారు. ఏపీ రాజకీయాల్లో కులాల ప్రభావం, కోనసీమ అల్లర్లు, పొత్తులపై పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోరాడితే పోయేదేముంది బానిస సంకెళ్లు తప్ప అని పవన్ అన్నారు. టీడీపీ (TDP)వాళ్లు బైబిల్ సూక్తి పాటించాలన్నారు. తనను తాను తగ్గించుకోవాలి.. తగ్గించుకుంటే తప్పేం లేదన్న పవన్.. ఈసారి మాత్రం మేము తగ్గేదేలేదన్నారు. ప్రజలు మంచి పాలన కోరుకుంటున్నారన్న పవన్.. 2024లో జనసేన, బీజేపీ (BJP)కలిసి పోటీ చేస్తాయన్నారు. ”కోనసీమ (Konaseema)లో అల్లర్లు కుల గొడవలుగా వైసీపీ (YCP) సృష్టించింది. జనసేన సిద్ధాంతాలు కలిగిన పార్టీ. కుల నిర్మూలన ఉంటేనే సమాజం బావుంటుందని నమ్మే పార్టీ. భారత దేశం కులాలతో నిర్మితమైన దేశం. భారత దేశ రాజకీయాలు కులాలతో ముడిపడిపోయి ఉన్నాయి.
స్వాతంత్ర్య పోరాటంలో కుల ప్రభావం లేదు. కానీ ఎన్నికలు వచ్చేసరికి కుల ప్రభావం (Caste Politics) ఎక్కువుగా ఉంటోంది. అంబేద్కర్ ప్రతిపాదించింది కుల నిర్మూలన. కొన్ని కులాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తున్నారు. మేం కుల రాజకీయాలు చేయం. ఏదైనా పని చేసేటప్పుడు అన్ని కులాలు కలవాలి. కానీ, ఓట్లు వేసేటప్పుడు కుల ప్రభావం కనిపిస్తోంది. వైసీపీ.. కోనసీమ అల్లర్లు సృష్టించి విచ్చిన్నం చేసింది. కోనసీమ అల్లర్లను బహుజన సిద్ధాంతాలపై దాడిగా జనసేన చూస్తుంది.
కులాలను విభజించి పాలించాలన్నదే వైసీపీ (YCP) వ్యూహం. కులాల ఐక్యత ఉండాలని కోరుకుంటా. కాపులు, ఎస్సీలు, శెట్టి బలిజ, మత్స్యకార కులాలు ఏకాభిప్రాయంతో ఉండేలా చూడాలి. ఆంధ్రప్రదేశ్ లో కులం అంటే భావన.. ఆంధ్ర అంటే రాదు. తెలంగాణలో కులం కంటే తెలంగాణ (Telangana) అనే భావనే ఎక్కువ.
విజయవాడలో (Vijayawada)రంగా గొడవ చూసుకుంటే ఇద్దరు వ్యక్తుల గొడవ కులాలు విడిపోయే స్ధాయికి దారి తీసింది. ఒకరు కమ్మ, మరొకరు కాపు గొడవతో రాష్ట్రమంతా గొడవలకు దారితీసింది. విజయవాడలో అలంకార్ ధియేటర్ తగలపెట్టారు. రాజకీయాల్లో సంపాదించిన సొమ్ము నిజాయితీగా సంపాందించినదా? నిజాయితీ కలిగిన అధికారులు మాట్లాడితే వింటాం. కానీ, కరప్షనిస్టులు మాట్లాడితే హాస్యాస్పదంగా ఉంది.
కరప్షన్ సమాజంలో పాతుకుపోయింది. రాష్ట్ర విభజన సమయంలో పాలకులు చేసిన తప్పులకు ప్రజలను ఇబ్బంది పెడతారా? వైసీపీ నాయకత్వం డబ్బులు సంపాదించుకోవడానికే అత్యధిక ప్రాధాన్యత. సారా నిషేధిస్తామని వారే స్వయంగా అమ్ముకుంటున్నారు. ఇసుక అక్రమ రవాణను అడ్డుకుంటామని చెప్పి.. ఇప్పుడు ఒకరికే కట్టబెట్టి దోచేస్తున్నారు. మనకి జరుగుతున్న అన్యాయాన్ని బావిలో కప్పలా చూస్తున్నాం.